క్యాంపస్ న్యూస్
ఐఐఎం -కోల్‌కతా
www.iimcal.ac.in
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(కోల్‌కతా).. వచ్చే నెల 7, 8 తేదీల్లో ఫైనాన్షియల్ రీసెర్చ్ వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులతో 2011లో ఐఐఎం-సీలో ఫైనాన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ఆర్థిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం రీసెర్చ్ వర్క్‌షాప్స్‌ను నిర్వహిస్తుంది. వచ్చే నెలలో జరిగే ఈ వర్క్‌షాప్‌కు దేశవిదేశాల నుంచి ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. అదేవిధంగా ఐవీ బిజినెస్ స్కూల్‌తో కలిసి కేస్ మెథడ్స్‌పై నవంబర్ 25 నుంచి 28 వరకు మూడున్నర రోజులపాటు వర్క్‌షాపును జరపనుంది. ఇందులో భాగంగా కేస్ రైటింగ్, కేస్ టీచింగ్‌పై ఐవీ బిజినెస్ స్కూల్ ఫ్యాకల్టీ సూచనలు, సలహాలు అందిస్తారు.
యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా
www.news.uwa.edu.au
యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ‘ద మాస్టర్ ఆఫ్ హెరిటేజ్ స్టడీస్’ పేరుతో కొత్త పీజీ డిగ్రీ కోర్సును నిర్వహిస్తోంది. రెండేళ్ల కాలపరిమితి ఉండే ఈ కోర్సు తరగతులను 2015 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. దేశీయ, అంతర్జాతీయ వారసత్వంతోపాటు హెరిటేజ్ మేనేజ్మెంట్కు సంబంధించిన కల్చరల్ సస్టెయినబిలిటీ, ప్లానింగ్ అండ్ డిజైన్, రిప్రజెంటేషన్ అండ్ ఎథిక్స్ వంటి అనేక అంశాలు ఈ కోర్సు కరికులమ్‌లో చేర్చారు. స్కూల్ ఆఫ్ ఇండీజీనియస్ స్టడీస్ అండ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ఆర్ట్స్, లా, ఆర్కిటెక్చర్, ల్యాండ్‌స్కేప్ అండ్ విజువల్ ఆర్ట్స్‌కు చెందిన ఫ్యాకల్టీ ఈ కోర్సు నిర్వహణలో పాలుపంచుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసినవారికి నేషనల్ పార్కులు, కన్జర్వేషన్ రిజర్వ్‌లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉపాధి లభించే అవకాశం ఉంది.