Financial Secretary
-
భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత ఫైనాన్షియల్ వ్యవస్థ నియంత్రణలకు అనుగుణంగా పటిష్ట బాటలో ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 27వ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరిస్తూ, ‘‘భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. అయితే ఏదైనా తీవ్ర సమస్య సూచిక కనిపించిన వెంటనే మనం ఎల్లప్పుడూ అప్రమత్తం కావాలి. అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన కాలిపై మనం నిలబడాలి’’ అని అన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యం అలాగే క్రెడిట్ సూచీ ఎదుర్కొంటున్న ద్రవ్య పరమైన ఒత్తిడి గురించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. వీటి ప్రభావం మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై లేదని భావిస్తున్నాం. ► ప్రభుత్వ బాండ్ల మార్కెట్ విషయంలో సాంకేతికత వినియోగం మరింత పెంపొందేలా చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. పెట్టుబడిదారులు ఆర్బీఐ లేదా సెబీ ఇన్ఫ్రా ద్వారా ఇందుకు సంబంధించి పొందుతున్న సదుపాయాలకన్నా, సాంకేతికత ద్వారా పొందుతున్న ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. ఇవే సాంకేతిక చర్యల మరింత పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం. ► అంతర్జాతీయంగా వస్తున్న ముందస్తు హెచ్చరిక సూచికలకు అనుగుణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకోవడం, ఆయా అంశాల్లో భారత్ సంసిద్ధత, నియంత్రణ నాణ్యతను మెరుగుపరచడం, దేశంలో కార్పొరేట్లు అలాగే గృహాల రుణ స్థాయిలు, కేవైసీ సరళీకరణ–క్రమబద్ధీకరణ, తద్వారా ఆర్థిక రంగంలో నియంత్రిత సంస్థలపై అనవసర భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై కౌన్సిల్ చర్చించింది. ఆయా అంశాలన్నీ డిజిటల్ ఇండియా అవసరాలను తీర్చడానికి మరింత పటిష్ట ఫ్రేమ్‌వర్క్‌ని రూపొందిస్తాయని భేటీ భావించింది. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీ నిర్ణయాలు, ఎఫ్ఎస్డీసీ గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కార్యాచరణ వంటి అంశాలపైనా తాజా కౌన్సిల్ దృష్టి సారించింది. ► ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాషిస్ పాండా, దివాలా బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ రవి మిట్టల్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్‌గా కొత్తగా నియమితులైన దీపక్ మెహంతీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కృష్టారావు కరాద్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్‌జోషి, తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై దృష్టి... కాగా, ఎఫ్ఎస్డీసీ సమావేశం ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రెగ్యులేటర్లకు సూచించింది. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ చేశాయి. దాదాపు 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించిన ఈ మొత్తాలను గత 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. డిపాజిటర్లు, లబ్ధిదారులు వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయగల కేంద్రీకృత పోర్టల్ మూడు లేదా నాలుగు నెలల్లో సిద్ధమవుతుందని గత నెలలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. -
పండుగల సీజన్లో రుణ వృద్ధిపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై ఆర్థిక శాఖ కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. బ్యాంకింగ్ సేవల విస్తృతి సహా ఉత్పాదక రంగాలకు తగిన రుణ సదుపాయాలు అందించడంపై ఈ సమావేశం దృష్టి సారించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల కథనం ప్రకారం, మొండిబకాయిలు మరింత తగ్గాల్సిన ఆవశ్యకతపై సైతం సమావేశం చర్చించింది. పండుగల సీజన్ నేపథ్యంలో రుణ వృద్ధిపై దృష్టి పెట్టాలని మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది. బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14.2 శాతం నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంసహా కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధాన మంత్రి ముద్ర యోజన, స్టాండ్‌అప్ ఇండియా, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనసహా వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిపై సమావేశంలో సమగ్ర సమీక్ష జరిగిందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలకు రుణాలు ఇవ్వడానికి సంబంధించి బ్యాంకుల పనితీరును కార్యదర్శి సమీక్షించారు. మున్ముందూ లాభాల బాటలోనే... మొండిబకాయిలు తగ్గడంసహా జూన్ నెల్లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించిన బ్యాంకింగ్ మున్ముందు కాలంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు దాదాపు 7 శాతం మేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020-21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. బ్యాం 2020-21లో పట్టాలపైకి... బ్యాంకింగ్‌కు 2020-21 చక్కటి యూ టర్న్ వంటిది. 2015-16 నుంచి 2019-20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదు చేసుకుంది. 2017-18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019-20లో రూ.25,941 కోట్లు, 2015-16లో రూ.17,993 కోట్లు, 2016-17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
భారత్ ఎకానమీ రికవరీ బాట
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ బాటన వేగంగా పయనిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో గడచిన ఏడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు దీనికి కారణమని అన్నారు. మహమ్మారి సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు ప్రభుత్వం సంస్కరణల ప్రక్రియను కొనసాగించినట్లు తెలిపారు. పలు వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ‘‘మహమ్మారి సవాళ్లు విరిసిన 18 నెలల్లో ఈ సమస్యలను కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా నిర్వహించింది. ప్రత్యేకించి సంస్కరణల పటిష్ట అజెండా అమలు ద్వారా ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన రికవరీ బాటన నిలబెట్టింది. దీనితో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పుంజుకునే అవకాశం ఏర్పడింది’’ ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో అని ఆయన అన్నారు. కొనసాగుతున్న సవాళ్లు ఇవీ... మహమ్మారి నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి పుంజుకోకపోవడం కొంత నిరాశ కలిగిస్తోందని అన్నారు. ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనం దీనికి ప్రధాన కారణమని వివరించారు. మౌలిక రంగం పురోగతి కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలని ఆయన పారిశ్రామిక వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జీడీపీలో మౌలిక విభాగం పెట్టుబడుల వాటా 5 నుంచి 6 శాతం ఉందని ఆయన పేర్కొంటూ ఈ పరిమాణం రెట్టింపు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం–పరిశ్రమ మధ్య సన్నిహిత సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. చదవండి : ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ ట్రేడింగ్‌పై బీఎస్ఈ కసరత్తు -
గతవారం బిజినెస్
నియామకాలు ఆర్థిక మంత్రిత్వ శాఖలో వ్యయ విభాగపు కార్యదర్శిగా ఉన్న అశోక్ లవాసా తాజాగా ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. సేవలపై మరో అరశాతం పన్ను బాదుడు రెస్టారెంట్లు, ఇంటర్నెట్, ఫోన్ బిల్లులు, ప్రయాణ చార్జీలు, బ్యాంకింగ్ ఇతరత్రా అనేక సేవలపై మరింత భారం పడింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన 0.5 శాతం కృషి కళ్యాణ్ సెస్ జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పన్నుల పరిధిలో ఉన్న అన్ని సేవలపై అదనంగా ఈ అర శాతం పన్నును వడ్డిస్తారు. దీంతో ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న సేవల పన్ను 15 శాతానికి చేరింది. పీఎఫ్ చందాదారులకు ఊరట ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి చందాదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఇకపై రూ. 50 వేల వరకూ పీఎఫ్ విత్‌డ్రాయెల్స్ విషయంలో మూలం వద్ద పన్ను (టీడీఎస్) ఉండదు. జూన్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ రూ. 30,000 విత్‌డ్రాయెల్స్ వరకూ మాత్రమే టీడీఎస్ మినహాయింపు ఉండేది. ఆఫ్రికా ఆయిల్ రిటైల్ బిజినెస్‌కు రిలయన్స్ గుడ్‌బై దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఆఫ్రికాలోని పెట్రో ఉత్పత్తుల రిటైల్ వ్యాపారానికి గుడ్‌బై చెప్పింది. గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్(గ్యాప్కో)లో తనకున్న 76 శాతం పూర్తి వాటాను ఫ్రాన్స్ దిగ్గజం టోటల్‌కు విక్రయించినట్లు ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఆర్థికాభివృద్ధి మెరుపులు భారత్ ఆర్థిక రంగం గడచిన ఆర్థిక సంవత్సరం (2015 ఏప్రిల్-2016 మార్చి) సాధించిన వృద్ధి అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలకు సంతోషాన్ని ఇచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చిచూస్తే... 2015-16లో ఈ విలువ 7.6 శాతం ఎగసింది. ఈ వృద్ధి శాతం ఐదేళ్ల గరిష్ట స్థాయి. గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2 శాతం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) ఈ గణాంకాలను విడుదల చేసింది. పీవీఆర్ చేతికి డీఎల్ఎఫ్ 32 స్క్రీన్లు రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు చెందిన డీటీ సినిమాస్ తన 32 స్క్రీన్లను మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్‌కు విక్రయించనున్నది. ఈ డీల్ విలువ రూ.433 కోట్లు. డీఎల్ఎఫ్కు చెందిన డీఎల్ఎఫ్ యుటిలిటిస్ సంస్థ డిటీ సినిమాస్‌ను నిర్వహిస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్, చండీగఢ్‌ల్లో ఉన్న 32 స్క్రీన్లు.. డిటీ సినిమాస్ నుంచి పీవీఆర్‌కు చేతులు మారతాయి. షావోమి ఫోన్లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 1,500 పేటెంట్లను కొనుగోలు చేసింది. ఈ పేటెంట్లు వీడియో, క్లౌడ్, మల్టీమీడియా టెక్నాలజీలకు సంబంధించినవి. ఈ ఒప్పందంలో భాగంగా షావోమి.. తన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్‌లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ (ఆఫీస్, స్కైప్‌తోపాటు)ను అప్లోడ్ చేసి, వాటిని ఇండియా, చైనాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది. అలీబాబాలోని వాటా విక్రయ దిశగా సాఫ్ట్‌బ్యాంక్ చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో ఉన్న తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నది సాఫ్ట్‌బ్యాంక్. రుణ భారం తగ్గించుకోవడం కోసం అలీబాబాలో ఉన్న వాటాలో దాదాపు 7.9 బిలియన్ డాలర్లకు సమానమైన భాగాన్ని విక్రయిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ పేర్కొంది. వాటా విక్రయం జరిగితే అలీబాబాలో 32.2%గా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ వాటా 28%కి తగ్గనున్నది. బ్యాంక్ రుణ భారం మార్చి చివరికి 106 బిలియన్ డాలర్లుకు చేరినట్లు తెలుస్తోంది. ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల్లో మన వారు ఫోర్బ్స్ రూపొందించిన ‘అమెరికా సంపన్న మహిళల’ వార్షిక జాబితాలో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు మహిళలు స్థానం పొందారు. ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్సోర్సింగ్ సంస్థ సింథెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథి 16వ స్థానంలో నిలిచారు. ఈమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉలాల్ 30వ ర్యాంక్‌ను పొందారు. ఈమె నికర సంపద 470 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక జాబితా అగ్రస్థానంలో ఏబీసీ సప్లై అధినేత్రి డయాన్ హెన్డ్రి క్స్ ఉన్నారు. ఈమె నికర సంపద 4.9 బిలియన్ డాలర్లుగా ఉంది. కీలక పరిశ్రమల వృద్ధి పరుగు ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తి వృద్ధి రేటు 2015 ఏప్రిల్‌తో పోల్చితే 2016 ఏప్రిల్‌లో 8.5 శాతంగా నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల మంచి పనితీరు దీనికి కారణం. ఇంకా ఈ గ్రూప్‌లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజవాయువు రంగాలు ఉన్నాయి. 2015 ఏప్రిల్‌లో ఈ గ్రూప్ ఉత్పత్తి (2014 ఏప్రిల్‌లో పోల్చితే) అసలు లేకపోగా -0.2 శాతం క్షీణించింది. గడచిన ఆర్థిక సంవత్సరం మొత్తంగా వృద్ధి రేటు 2.7 శాతంగా ఉంది. స్మార్ట్‌ఫోన్స్ తయారీ యోచన లేదు: పిచాయ్ ఇప్పటికిప్పుడు సొంతంగా స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేయాలనే ఉద్దేశం తమకు లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టంచేశారు. మొబైల్స్ తయారీకి ఇతర భాగస్వాములతో పనిచేయాలనే ప్రణాళికనే అవలంబిస్తామని చెప్పారు. తగ్గిన పీ-నోట్ల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్లోకి పీ-నోట్ల ద్వారా వచ్చే పెట్టుబడులు గత నెల నాటికి 20 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. పీ-నోట్ల సంబంధిత నియమనిబంధనలను సెబీ పటిష్టం చేయడంతో వాటి పెట్టుబడులు గత నెలలో 2.11 లక్షల కోట్లకు పడిపోయాయి. పీ-నోట్ల పెట్టుబడులకు భారత్‌కు చెందిన మనీ లాండరింగ్ నిరోధక చట్టాలు వర్తిస్తాయని, ఏమైనా అనుమానాస్పద లావాదేవీలుంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ పీ-నోట్ల నిబంధనలను సెబీ కఠినతరం చేసిన విషయం తెలిసిందే. డీల్స్.. రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో 15 శాతం వాటా కొనుగోలును ఓఎన్జీసీ విదేశ్ పూర్తి చేసింది. వాంకోర్ చమురు క్షేత్రాన్ని నిర్వహించే జేఎస్సీ వాంకోర్‌నెఫ్ట్ కంపెనీలో ఈ 15 శాతం వాటాను ఓఎన్జీసీ విదేశ్ 126.8 కోట్ల డాలర్లకు రష్యా జాతీయ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఓఎన్జీసీ విదేశ్కు ఇది నాలుగో అతి పెద్ద కొనుగోలు లావాదేవీ. ♦ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)కు చెందిన సాధారణ బీమా సంస్థ విభాగం హెచ్డీఎఫ్సీ ఎర్గో... ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనున్నది. డీల్ విలువ రూ.551 కోట్లు. ♦ ఐడియా సెల్యులర్ కంపెనీలో 3.47 శాతం వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్‌రూ.1,388 కోట్లకు విక్రయించింది. -
ఆర్థిక కార్యదర్శిగా అశోక్ లవాసా
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖలో వ్యయ విభాగపు కార్యదర్శిగా ఉన్న అశోక్ లవాసా తాజాగా ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. లవాసా.. 1980 బ్యాచ్‌కు చెందిన హరియాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది. ఈయన బ్యాచ్‌మేట్ అయిన శక్తికాంత దాస్.. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యద ర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రెవెన్యూ కార్యదర్శిగా హస్ముఖ్ అధియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా అంజులీ చిబ్ దుగ్గల్, ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా నీరజ్ కుమార్ గుప్తా ఉన్నారు.