గతవారం బిజినెస్ | last week business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Jun 6 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

last week business

నియామకాలు
ఆర్థిక మంత్రిత్వ శాఖలో వ్యయ విభాగపు కార్యదర్శిగా ఉన్న అశోక్ లవాసా తాజాగా ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. సేవలపై మరో అరశాతం పన్ను బాదుడు  రెస్టారెంట్లు, ఇంటర్నెట్, ఫోన్ బిల్లులు, ప్రయాణ చార్జీలు, బ్యాంకింగ్ ఇతరత్రా అనేక సేవలపై మరింత భారం పడింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన 0.5 శాతం కృషి కళ్యాణ్ సెస్  జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పన్నుల పరిధిలో ఉన్న అన్ని సేవలపై అదనంగా ఈ అర శాతం పన్నును వడ్డిస్తారు. దీంతో ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న సేవల పన్ను 15 శాతానికి చేరింది.

 పీఎఫ్ చందాదారులకు ఊరట
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి చందాదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఇకపై రూ. 50 వేల వరకూ పీఎఫ్ విత్‌డ్రాయెల్స్ విషయంలో మూలం వద్ద పన్ను (టీడీఎస్) ఉండదు. జూన్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ రూ. 30,000 విత్‌డ్రాయెల్స్ వరకూ మాత్రమే టీడీఎస్ మినహాయింపు ఉండేది.

 ఆఫ్రికా ఆయిల్ రిటైల్ బిజినెస్‌కు రిలయన్స్ గుడ్‌బై
దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఆఫ్రికాలోని పెట్రో ఉత్పత్తుల రిటైల్ వ్యాపారానికి గుడ్‌బై చెప్పింది. గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్(గ్యాప్‌కో)లో తనకున్న 76 శాతం పూర్తి వాటాను ఫ్రాన్స్ దిగ్గజం టోటల్‌కు విక్రయించినట్లు ఆర్‌ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.

 ఆర్థికాభివృద్ధి మెరుపులు
భారత్ ఆర్థిక రంగం గడచిన ఆర్థిక సంవత్సరం (2015 ఏప్రిల్-2016 మార్చి) సాధించిన వృద్ధి అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలకు సంతోషాన్ని ఇచ్చింది.  2014-15 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చిచూస్తే... 2015-16లో ఈ విలువ 7.6 శాతం ఎగసింది. ఈ వృద్ధి శాతం ఐదేళ్ల గరిష్ట స్థాయి.  గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2 శాతం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) ఈ గణాంకాలను విడుదల చేసింది.

 పీవీఆర్ చేతికి డీఎల్‌ఎఫ్ 32 స్క్రీన్లు
రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు చెందిన డీటీ సినిమాస్ తన 32 స్క్రీన్లను మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్‌కు విక్రయించనున్నది. ఈ డీల్ విలువ రూ.433 కోట్లు.  డీఎల్‌ఎఫ్‌కు చెందిన డీఎల్‌ఎఫ్ యుటిలిటిస్ సంస్థ డిటీ సినిమాస్‌ను నిర్వహిస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్, చండీగఢ్‌ల్లో ఉన్న 32 స్క్రీన్లు.. డిటీ సినిమాస్ నుంచి పీవీఆర్‌కు చేతులు మారతాయి.

 షావోమి ఫోన్లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్
చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 1,500 పేటెంట్‌లను కొనుగోలు చేసింది. ఈ పేటెంట్లు వీడియో, క్లౌడ్, మల్టీమీడియా టెక్నాలజీలకు సంబంధించినవి. ఈ ఒప్పందంలో భాగంగా షావోమి.. తన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్‌లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ (ఆఫీస్, స్కైప్‌తోపాటు)ను అప్‌లోడ్ చేసి, వాటిని ఇండియా, చైనాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది.

 అలీబాబాలోని వాటా విక్రయ దిశగా సాఫ్ట్‌బ్యాంక్
చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో ఉన్న తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నది సాఫ్ట్‌బ్యాంక్. రుణ భారం తగ్గించుకోవడం కోసం అలీబాబాలో ఉన్న వాటాలో దాదాపు 7.9 బిలియన్ డాలర్లకు సమానమైన భాగాన్ని విక్రయిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ పేర్కొంది. వాటా విక్రయం జరిగితే అలీబాబాలో 32.2%గా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ వాటా 28%కి తగ్గనున్నది. బ్యాంక్ రుణ భారం మార్చి చివరికి 106 బిలియన్ డాలర్లుకు చేరినట్లు తెలుస్తోంది.

 ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల్లో మన వారు
ఫోర్బ్స్ రూపొందించిన ‘అమెరికా సంపన్న మహిళల’ వార్షిక జాబితాలో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు మహిళలు స్థానం పొందారు. ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్‌సోర్సింగ్ సంస్థ సింథెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథి 16వ స్థానంలో నిలిచారు. ఈమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉలాల్ 30వ ర్యాంక్‌ను పొందారు. ఈమె నికర సంపద 470 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక జాబితా అగ్రస్థానంలో ఏబీసీ సప్లై అధినేత్రి డయాన్ హెన్‌డ్రి క్స్ ఉన్నారు. ఈమె నికర సంపద 4.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

 కీలక పరిశ్రమల వృద్ధి పరుగు
ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తి వృద్ధి రేటు 2015 ఏప్రిల్‌తో పోల్చితే 2016 ఏప్రిల్‌లో 8.5 శాతంగా నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల మంచి పనితీరు దీనికి కారణం. ఇంకా ఈ గ్రూప్‌లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజవాయువు రంగాలు ఉన్నాయి. 2015 ఏప్రిల్‌లో ఈ గ్రూప్ ఉత్పత్తి (2014 ఏప్రిల్‌లో పోల్చితే) అసలు లేకపోగా -0.2 శాతం క్షీణించింది. గడచిన ఆర్థిక సంవత్సరం మొత్తంగా వృద్ధి రేటు 2.7 శాతంగా ఉంది. 

 స్మార్ట్‌ఫోన్స్ తయారీ యోచన లేదు: పిచాయ్
ఇప్పటికిప్పుడు సొంతంగా స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేయాలనే ఉద్దేశం తమకు లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టంచేశారు. మొబైల్స్ తయారీకి ఇతర భాగస్వాములతో పనిచేయాలనే ప్రణాళికనే అవలంబిస్తామని చెప్పారు.

 తగ్గిన పీ-నోట్ల పెట్టుబడులు
భారత క్యాపిటల్ మార్కెట్లోకి పీ-నోట్ల ద్వారా వచ్చే పెట్టుబడులు గత నెల నాటికి  20 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. పీ-నోట్ల సంబంధిత నియమనిబంధనలను సెబీ పటిష్టం చేయడంతో వాటి పెట్టుబడులు గత నెలలో 2.11 లక్షల కోట్లకు పడిపోయాయి. పీ-నోట్ల పెట్టుబడులకు భారత్‌కు చెందిన మనీ లాండరింగ్ నిరోధక చట్టాలు వర్తిస్తాయని, ఏమైనా అనుమానాస్పద లావాదేవీలుంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ పీ-నోట్ల నిబంధనలను సెబీ కఠినతరం చేసిన విషయం తెలిసిందే.

డీల్స్..
రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో 15 శాతం వాటా కొనుగోలును ఓఎన్‌జీసీ విదేశ్ పూర్తి చేసింది. వాంకోర్ చమురు క్షేత్రాన్ని నిర్వహించే జేఎస్‌సీ వాంకోర్‌నెఫ్ట్ కంపెనీలో ఈ 15 శాతం వాటాను ఓఎన్‌జీసీ విదేశ్ 126.8 కోట్ల డాలర్లకు రష్యా జాతీయ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఓఎన్‌జీసీ విదేశ్‌కు ఇది నాలుగో అతి పెద్ద కొనుగోలు లావాదేవీ.

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ)కు చెందిన సాధారణ బీమా  సంస్థ విభాగం హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో... ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనున్నది. డీల్ విలువ రూ.551 కోట్లు.

ఐడియా సెల్యులర్ కంపెనీలో 3.47 శాతం వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్‌రూ.1,388 కోట్లకు విక్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement