మళ్లీ పొలంబాట..!
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ కుటుంబాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కరువు, వరదలు వంటి వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ... గ్రామాల్లో అత్యధిక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా మారింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పొలంబాట పట్టే కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. నాబార్డు 2016–17 సంవత్సరంలో నిర్వహించిన రూరల్ ఫైనాన్సియల్ సర్వే ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబాలు 48 శాతం ఉండగా... 2021–22లో నిర్వహించిన సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాలు 57 శాతానికి పెరిగాయి.దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు 9 శాతం పెరిగినట్లు ఈ సర్వే స్పష్టంచేసింది. ఇటీవల నాబార్డు ఆ సర్వే వివరాలను వెల్లడించింది. ఏపీతో సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది.2016–17లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉండగా... 2021–22లో ఏకంగా 53 శాతానికి పెరిగాయి. మన రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు 19 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో కేవలం 18 శాతం కుటుంబాలు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, మేఘాలయ, బిహార్, సిక్కిం, త్రిపుర, పంజాబ్, మిజోరాం, మణిపూర్లలోను వ్యవసాయేతర కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి.