ఫిరాఖ్, ఫైర్ సినిమాలను తీయగలమా?
సాక్షి, కోల్‌కతా: నటి, దర్శకురాలు నందితా దాస్ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నటులు, రచయితలకు ఇది గడ్డుకాలమని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమని పేర్కొన్నారు. గతంలో తీసిన కళాత్మక, ఉత్తమ సినిమాలను ఇపుడు తీయగలమా అనే భావం కలుగుతోందన్నారు. సంజయ్ లీలా బన్సాలీ చిత్రం పద్మావత్ వివాదంపై స్పందించిన నందితా దాస్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
టాటా స్టీల్ సాహిత్యోత్సవంలో పాల్గొన్న ఆమె ఫిరాఖ్,(గుజరాత్ మతవిద్వేషం,మానవహననం నేపధ్యంలో సాగే కథ, నందితా దాస్ దర్శకత్వంలో తొలి చిత్రం, ఉత్తమ చిత్రం అవార్డు ) (2008) , ఫైర్(1996) లాంటి చిత్రాలు తీయడం తనకు ఇపుడు సాధ్యమో కాదో తెలియదుకానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మూవీలు తీయడం ఎప్పటికీ సాధ్యంకాదని అన్నారు. అలాగే ఎన్నోఏళ్ల క్రితం శ్యాం బెనగల్ తీసిన భారత్ ఏక్ ఖోజ్ సినిమాలో పద్మావతికి సంబంధించిన అంశం ఉంటుందని తెలిపారు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. అలాంటి చిత్రాలను స్వాగతించాం, కానీ ఇపుడు నటులు, రచయితలు భయానక సమయంలో ఉన్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా..ముందుగానే రచయితలు మరింత బాధ్యతగా, సెల్ఫ్ సెన్సార్‌గా ఉండాలని సూచించారు.
దురదృష్టవశాత్తూ సమాజంలోని కొన్ని వర్గాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ అసమ్మతి , భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిని పెంచినప్పటికీ , హింసను ప్రేరేపించడం దారుణమన్నారు. మనకు ప్రతీ సినిమా నచ్చాలని లేదు. అలాగే నచ్చని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసే ప్లాట్‌ఫాంలు కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆ స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది. అలాకాకుండా హింసామార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ మాంటోకు సంబంధించన వివరాలను పంచుకున్నారు. విభజన సమయంలో (1946-50) రచయిత సాడాత్ హసన్ మాంటో జీవితంపై ఆధారపడి తీస్తున్న చిత్రానికి సంబంధించి కంటెంటే తనకు ప్రధానమని చెప్పారు.