దేశంలోనే ప్రథమ మోసగాడు బాబు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
చిల్లకూరు : అధికారం కోసం అలవికాని హామీలిచ్చారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నా.. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా దేశంలోనే ప్రథమ మోసగాడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆ పార్టీ మండల కన్వీనర్ ఎద్దల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల కమిటీల ఎంపిక నిర్వహించా రు.
ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు. అవసరం ఉన్నప్పుడు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుని, పనయ్యాక దగా చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు మరిచిపోయారని, రాజధానిని సింగపూర్ చేస్తానంటూ రైతుల పొట్ట కొట్టే పనిలో తలమునకలై ఉన్నారన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు కాకుండా ఆయన ఏర్పాటు చేసిన కమిటీలు పరిపాలన చేస్తున్నాయన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చడంలో నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
తెలుగుగంగ నీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిం దని, చంద్రబాబు ప్రభుత్వం మరో 20 ఏళ్లు వెనక్కు నెట్టే ప్రయత్నాలు చేస్తుందన్నారు.
గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ అధికారంలో లేనప్పటికీ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తల జోలికి వస్తే ఇతర పార్టీల నాయకుల బండారాలను బయటపెడతామన్నారు. అనంతరం పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.