త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..
పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫస్ట్‌క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు.
కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్‌క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్‌హోల్డర్‌గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది.
6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్‌లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్‌క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు.
ఫస్ట్‌క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్‌క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్ మహీంద్ర, సాఫ్ట్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి.