సింధుకు నిరాశ
మలేసియా మాస్టర్స్ టోర్నీ
కుచింగ్: బ్యాడ్మింటన్ సీజన్ తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత క్రీడాకారులెవరూ ఫైనల్ చేరుకోకుండానే ఇంటిముఖం పట్టారు. మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు 21-19, 13-21, 8-21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో; పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ 21-10, 17-21, 16-21తో హ్యోక్ జిన్ జియోన్ (దక్షిణ కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయారు.
సింధు, జయరామ్‌లిద్దరూ తమ ప్రత్యర్థులపై తొలి గేమ్ గెలిచాక తర్వాతి రెండు గేమ్‌లను చేజార్చుకోవడం గమనార్హం. ప్రపంచ 24వ ర్యాంకర్ ఒకుహారా చేతిలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధుకిది వరుసగా రెండో ఓటమి. గతేడాది హాంకాంగ్ ఓపెన్‌లోనూ ఒకుహారా చేతిలో సింధు ఓడిపోయింది. గంటా 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి రెండు గేముల్లో గట్టిపోటీనే ఇచ్చింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ఒకుహారా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది.
రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్ల చొప్పున, మరో రెండుసార్లు వరుసగా మూడు పాయింట్ల చొప్పున ఈ జపాన్ అమ్మాయి పాయింట్లు సాధించి సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీస్‌లో ఓడిన సింధు, జయరామ్‌లకు 1,740 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. లక్షా 7 వేలు)తోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.