'విదేశాల్లోనల్లధనంపై సిట్ ను ఏర్పాటు చేస్తున్నాం'
ఢిల్లీ: విదేశాల్లో నల్లధనాన్ని తీసుకురావడంపై తొలి కేబినెట్ లో చర్చించామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగళవారం నరేంద్ర మోడీ కేబినెట్ కొలువుదీరిన తరువాత జరిగిన మంత్రుల తొలి సమావేశం రెండు గంటలకు పైగా సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రవిశంక్ ప్రసాద్.. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకురావడంపై ప్రధానంగా చర్చించామన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి వైస్ చైర్మన్ గా జస్టిస్ అర్జిత్ పసాయత్ ఉంటారన్నారు.
ఇందులో రెవిన్యూ ఇంటెలిజెన్స్ సెక్రటరీ, రిజర్వ్‌బ్యాంకు డిప్యూటీ గవర్నర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సీబీఐ డైరెక్టర్, ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారన్నారు. అత్యున్నత వ్యక్తులను సిట్‌లో సభ్యులుగా నియమించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, పోలవరం ముంపు గ్రామాలపై ఇంకా ఎలాంటి చర్చా జరగలేదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.