తొలిసారి ఎన్నికల బరిలో మహిళలు
సౌదీ అరేబియాలోని మహిళలు తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తూ, ప్రచార పర్వం మొదలుపెట్టారు. మహిళలకు సమాన హక్కులు కలగా మిగిలిన సౌదీలో క్రమంగా సంస్కరణల పర్వం ప్రారంభం అవుతోంది. డిసెంబర్ 12న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు అవకాశం కల్పించడంతో సుమారు 900 మంది వరకు మహిళలు పోటీ చేస్తున్నారు. వాస్తవానికి ఇంతవరకు అక్కడి మహిళలకు ఓటుహక్కు కూడా లేదు.
సౌదీలో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు 2005లో జరిగాయి. తర్వాత 2011లో జరిగాయి. కానీ రెండుసార్లూ వాటిలో కేవలం పురుషులే పోటీ చేశారు. పోటీ చేస్తున్నవాళ్లలో మహిళలుంటే చాలని, తాము వాళ్లకే ఓటేస్తామని, వారి గురించి తమకు ఏమీ తెలియకపోయినా పర్వాలేదని ఓటుహక్కు లభించిన ఓ ఉపాధ్యాయిని చెప్పారు. మొత్తం 284 మున్సిపల్ స్థానాలకు పోటీ జరుగుతుండగా వాటిలో 7వేల మంది పోటీ పడుతున్నారు.
సౌదీ జనాభా సుమారు 2.1 కోట్లు ఉండగా, అందులో కేవలం 1.31 లక్షల మంది మహిళలకు మాత్రమే ఇప్పటివరకు ఓటుహక్కు వచ్చింది. అదే పురుష ఓటర్లు మాత్రం 13.5 లక్షల మంది ఉన్నారు. దూరాలు వెళ్లి ఓటు నమోదు చేయించుకోవాల్సి రావడం, అధికారులు ఇబ్బంది పెట్టడం, అవగాహన లేమి తదితర కారణాల వల్లే ఓటర్లుగా నమోదు తగ్గిందని మహిళలు చెబుతున్నారు.