కోలుకుంటోన్న చైనా
బీజింగ్ : చైనా ఆర్థికవ్యవస్థ మందగమనంలో నడుస్తున్నప్పటికీ భవిష్యత్తులో స్థిరంగా కొనసాగే సంకేతాలు వెల్లువడుతున్నాయి. 2016 తొలి త్రైమాసికంలో ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి స్వల్పంగా తగ్గి 6.7 శాతంగా నమోదైనప్పటికీ, కొన్ని ప్రధాన సూచికలు ఆర్థికవ్యవస్థకు శుభసంకేతాలను అందిస్తున్నాయని ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం(ఎన్ బీసీ) తెలిపింది. ఈ త్రైమాసికంలో నమోదైన వృద్ధి శాతం ప్రభుత్వ, మార్కెట్లు నిర్దేశించుకున్న 6.5-7శాతం లక్ష్యాలకు, అంచనాలకు మధ్యలో ఉందని పేర్కొంది.
దాదాపు తొమ్మిది నెలల తర్వాత చైనా ఎగుమతులు పెరిగాయనే గణాంకాలు విడుదల కావడం కూడా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంచేందుకు సహకరిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. తయారీ పరిశ్రమలు, విద్యుత్ రంగం, తదితర పరిశ్రమలు ఈ ఏడాది మొదటి నుంచే మంచి ఫలితాను ఇస్తున్నాయని పేర్కొంది. సేవారంగం, ప్రాథమిక, ద్వితీయ రంగాలన్నీ కలిపి రెండు శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తుండటం కూడా ఆర్థికవ్వవస్థ పుంజుకోవడానికి దోహదం చేస్తాయని ఎన్ బీసీ పేర్కొంది. స్థిర ఆస్తి పెట్టుబడులు తొలి త్రైమాసికంలో 10.7శాతంగా నమోదవ్వగా, ప్రాపర్టీ రంగం కూడా 6.2శాతంకు పెరిగింది. పడిపోతున్న ఆర్థికవ్యవస్థను మెరుగు పరిచేందుకు చైనా, వడ్డీరేట్లు, పన్నులు తగ్గిస్తూ పలు సంస్కరణలను ప్రవేశపెట్టింది.