మన వరకు ఓకే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొత్త రాష్ట్రం... తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు... ఓ మంత్రి... ఇద్దరు ప్రతిపక్షాలకు సంబంధించిన ఫ్లోర్‌లీడర్లు... ఒకరైతే ఏకంగా ప్రతిపక్ష నేత... మరో డిప్యూటీ లీడర్... కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో నూతనోత్సాహం... అందరి దృష్టి శాసనసభా బడ్జెట్ సమావేశాల వైపే... సభలో ఏం జరుగుతుంది... గతంలాగానే అరుపులు, కేకలు.. వాకౌట్లు.. సస్పెన్షన్లేనా? ప్రజలకు ఏమైనా తెలంగాణ చట్టసభ ఉపయోగపడుతుందా? అందులో మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారి తీరు ఎలా ఉంటుంది? జిల్లాకు ఏమైనా ఈ సమావేశాలు ఉపయోపడతాయా? బడ్జెట్లో జిల్లాకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా? పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం కలుగుతుందా? జిల్లాలో వైద్య, విద్య, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది? అనేది జిల్లావాసుల్లో చర్చనీయాంశమైంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుంచి నిరజిల్లా ప్రజానీకం బడ్జెట్‌ను, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును ఆసక్తికరంగా గమనించారు. అయితే, తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు జిల్లా వాసులు ఆశించిన రీతిలోనే జరిగాయా? జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటి? మన నేతలు అసెంబ్లీలో ఏం చేశారనే దానిపై ‘సాక్షి’ కథనం....
చురుకైన పాత్రే
తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లా నేతలు చురుకైన పాత్ర పోషించారనే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కె. జానారెడ్డి, మంత్రి హోదాలో సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జి.జగ దీష్‌రెడ్డి, సీపీఐ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రవీంద్రకుమార్ (దేవరకొండ)లకు సభలో ఎక్కువసార్లు మాట్లాడే అవకాశం వచ్చింది. ఇక బడ్జెట్లోని పలు పద్దులపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిలు మాట్లాడారు. పారిశ్రామిక విధానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరడం, స్పీకర్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆయన అలక, ఆగ్రహాన్ని కలగలిపి ప్రదర్శించడం, సీఎం జోక్యంతో కథ సుఖాంతం కావడం ఆసక్తి కలిగించే పరిణామంగా చెప్పుకోవాలి. జిల్లాకు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అనేక అంశాలపై తమ గళం విప్పారు. జిల్లాకు చెందిన సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీఎల్పీ నేత హోదాలో జిల్లా సీనియర్ నేత జానారెడ్డి వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ సభ్యుల్లోనే మిశ్రమస్పందన వ్యక్తమయినా, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడంలో అధికార పక్షానికి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ కూడా సభలో హుందాగా వ్యవహరించందనే అభిప్రాయాన్ని జిల్లా వాసులు వ్యక్తం చేస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీనే హైలై ట్
ఇక శ్రీశైల సొరంగమార్గం (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు వ్యవహారం ఈసారి సభలోనే హైలెట్ అయింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల చొరవతో ప్రత్యేక అంశం కింద చర్చకు వచ్చిన ఈ అంశంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు గాను కీలకమైన కదలిక వచ్చింది. ఈ టన్నెల్ నిర్మాణంతో పాటు డిండి రిజర్వాయర్, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల లాంటి పథకాలకు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. దీనిపై శాసనసభ కమిటీ హాల్లో వరుసగా రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు, జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిసి చర్చలు జరిపారు. మొత్తంమీద ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్ఎల్బీసీ సొరంగమార్గం ఓ కొలిక్కి రావడంతో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల రైతాంగానికి ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టు తొందర్లోనే పూర్తవుతుందనే ఆశతో జిల్లా వాసులున్నారు.
‘కొండ’ంత అభివృద్ధి
ఇక, తెలంగాణలోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రమైన జిల్లాలోని యాదగిరిగుట్ట అభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు పెట్టడం ఈ సమావేశాల్లో విశేషంగా చెప్పుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో గుట్టను అభివృద్ధి చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈసారి కొండ పరిసరాల సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించారు. కొండ చుట్టూ ఆకాశహర్మ్యాలు, కల్యాణమండపాలు, అభయారణ్యం అభివృద్ధి, వేద పాఠశాలలాంటి నిర్మాణాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నట్టు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. దీంతో యాదగిరి కొండ తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి దిశలో ముందుకెళుతుందని ప్రజల ఆకాంక్ష. ఇక, మిగిలిన విషయాలకు వస్తే హైదరాబాద్-నల్లగొండ పరిశ్రమల కారిడార్, లక్ష ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ వయోపరిమితి సడలింపు లాంటి అంశాలు జిల్లా నిరుద్యోగ లోకంలో ఉపాధి ఆశలు కల్పించగా, శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై జరిగిన గొడవ, ఫ్రభుత్వ భూముల కబ్జాలపై సభాసంఘాన్ని నియమించడం, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల భూ ఆక్రమణల వ్యవహారం వెలుగులోనికి తేవడం, రహదారుల నిర్మాణానికి జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించడం లాంటి అంశాలు జిల్లా ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక, రైతుల ఆత్మహత్యలపై తగినంత చర్చలు జరగకపోవడం, విద్యుత్ సమస్య నివారణకు ప్రభుత్వం నుంచి సమగ్ర రీతిలో హామీ రాకపోవడం, అమరవీరుల కుటుంబాల గురించి సభలో చర్చ జరిగిన తీరు లాంటివి కొంత నిరాశపరిచాయనే చెప్పాలి.