4 నుంచి లోక్సభ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి
న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన 16వ లోక్సభ తొలి సమావేశాలు వచ్చే నెల 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు గురువారం తెలిపారు. పార్లమెంటు సమావేశాలపై కేబినెట్ సమావేశమై చర్చించిన అనంతరం ఆయన విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. 4, 5 తేదీల్లో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని, మరుసటి రోజు లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుందని వివరించారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 9న ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని, అదే తేదీ నుంచి రాజ్య సభ సమావేశాలు మొదలవుతాయని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే తీర్మానం లోక్సభలో 10న, రాజ్యసభలో 11న చేపడతామని వివరించారు. కాగా కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేం దుకు సీనియర్ కాంగ్రెస్ ఎంపీ కమల్నాథ్ ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తారని, ఆయనకు అర్జున్ చరణ్ సేథీ (బీజేడీ), పూర్ణో ఎ సంగ్మా(నేషనల్ పీపుల్స్ పార్టీ), బీరేన్ సింగ్(కాంగ్రెస్)తో కూడిన ప్యానెల్ సహాయకారిగా ఉంటుందని వివరించారు. స్పీకర్ పోస్టుకు సంబంధిం చి ఎవరినైనా ఖరారు చేశారా అని ప్రశ్నించగా.. ఇంకా అలాంటిదేమీ లేదన్నారు. అవసరాన్ని బట్టి సమావేశాలను ఒక రోజు పొడిగించే అవకాశం ఉందన్నారు.
కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇస్తారా?
తగినంతమంది సభ్యులు లేకున్నా కూడా కాంగ్రెస్కు సభలో ప్రతిపక్ష హోదా ఇస్తారా అని ప్రశ్నించగా.. ‘‘ఈ అంశంపై చర్చించే సమయంలో మేం చాలా అంశాలను పరిశీలించాం. దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయముంది’’ అని వెంకయ్య అన్నారు. 543 మంది సభ్యుల లోక్సభలో కనీసం 10 శాతం సీట్లు వచ్చిన పార్టీకి చెందిన సభ్యుడికే కేబినెట్ ర్యాంకుగల ప్రతిపక్ష నాయకుడి హోదా లభిస్తుంది. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఏ పార్టీకీ ఆ మేర సీట్లు రాలేదు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్య కంటే 10 సీట్లు తక్కువగా 44 సీట్లు వచ్చాయి.