ఫుల్ ఎనర్జీతో...
వైవీఎస్ చౌదరి ‘రేయ్’ సినిమా తుది అంకానికి చేరుకుంది. పాటల వేడుకను భారీ ఎత్తున చేయడానికి చౌదరి ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ చిత్రం ద్వారా చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని సాయిధరమ్‌తేజ్ పాత్రను ఫుల్ ఎనర్జీతో చౌదరి తీర్చిదిద్దారు. ముఖ్యంగా పాటల విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చౌదరి పాటలు బాగా తీస్తారని, ఆయనకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉందని ప్రతీతి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మ్యూజిక్ ఉంటుందంటున్నారు చౌదరి. ఆయన మరిన్ని వివరాలు చెబుతూ- ‘‘నా తొలి సినిమా ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ’ నుంచి ఇప్పటివరకూ నా సినిమాల్లో పాటలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘రేయ్’ పాటలు కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటాయి. ఆడియో హక్కుల్ని ఓ పెద్ద కంపెనీ తీసుకోనుంది. డిసెంబర్ మొదటివారంలో పాటల వేడుకను విభిన్నంగా చేయబోతున్నాం. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఈ వేడుకలో పాల్గొంటారు’’ అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ‘రేయ్’ సంక్రాంతికి విడుదల కానుంది. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: చంద్రబోస్.