పరిగిని ముందువరుసలో నిలబెడతా
♦ ‘పాలమూరు ఎత్తిపోతల’ తీసుకువస్తా
♦ పరిగిని ముందువరుసలో నిలబెడతా
♦ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
పరిగి: అభివృద్ధిలో పరిగిని జిల్లాలోనే ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మల్లెమోనిగూడలో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులకు ఆయన స్థానిక సర్పంచ్ విజయమాల, ఎంపీటీసీ సభ్యుడు సమద్, ఎంపీడీఓ విజయప్ప, పీఆర్ డీఈఈ అంజయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు ఎత్తి పోతల పథకాన్ని పరిగి నియోజకవర్గానికి తీసుకువచ్చి తీరుతామన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో ఎన్ని పోరాటాలకైనా సిద్ధమన్నారు. మల్లెమోనిగూడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. గ్రామస్తులకు సురక్షిత నీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు.
అయితే ఈ క్రమంలో నాయకుడు అశ్రఫ్ మాట్లాడుతూ ..అర్బన్ ప్రాంతాలకు దూరంగా ఉన్న అనుబంధ గ్రామాలకు సైతం పరిగి లాంటి పట్టణాలకు సమానంగా పన్నులు విధిస్తున్నారని తెలుపగా..ఈ విషయమై ఎమ్మెల్యే అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు. అనంతరం సర్పంచ్ విజయమాల మాట్లాడుతూ ..మల్లెమోనిగూడ గ్రామాభివృద్ధికోసం పంచాయతీ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈలు బాలచందర్, రమ్య, పంచాయతీ ఈఓ కృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి, సుభాష్చందర్రెడ్డి, అశ్రఫ్, రవీంద్ర, ఎర్రగడ్డపల్లి కృష్ణ, టి. వెంకటేష్, సత్యంపేట్, బండలింటి మైపాల్, పరశురాంరెడ్డి, గోపాల్, అక్బర్, ఆనెం ఆంజనేయులు, ఎదిరే కృష్ణ, సర్వర్, నందు, నయీమోద్దీన్, శివకుమార్, షాహెద్, పాల్గొన్నారు.