‘సముద్ర'మంత సంతోషం
బాపట్ల : మత్స్యకారులు చేపల పండగ చేసుకుంటున్నారు. హుదూద్ తుపాను కారణంగా సముద్రంలో ఏర్పడిన సుడిగుండాలతో చేపలు తీరప్రాంతానికి కొట్టుకొస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో వేటకు విరామం పకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు వేట సక్రమంగా సాగక అసంతృప్తితో ఉన్న మ త్స్యకారులకు ఇప్పుడు పంట పండినట్లైంది.
సముద్రంలో రెండు,మూడు రోజులు వేట చేస్తే కనీస కూలి కూడా గిట్టని పరిస్థితుల్లో ఐలు వలలకు భారీగా చేపలు చిక్కడంతో వారి ఆనందానికి అవధులు లేనట్లైంది.
దీనికి తోడు మార్కెట్లో చేపల ధర కూడా ఆశాజనకంగా ఉండటం ఈ ఏడాది సీజన్ కలిసొచ్చినట్లు భావిస్తున్నారు.
గత వారం హుదూద్ తుపాను కారణంగా సముద్రంలో సుడిగుండాలు ఏర్పడటం, ప్రస్తుతం అమావాస్య రోజులు కావటంతో సముద్రం లోపల ఉన్న చేపలు భారీగా తీరం చేరుతున్నాయి.
ముఖ్యంగా ఆక్వా, కోళ్ల పరిశ్రమలకు సంబంధించి మక్కిన రకం చేపలు ఐలు వలలకు చిక్కుతున్నాయి. దీంతో మత్స్యకారులు తీరప్రాంతంలో వేట ముమ్మరం చేశారు.
ఒక్కో ఐలు వలకు కనీసం 30 నుంచి 40 టన్నుల వరకు చేపలు పడటంతో తీరంలో సందడి వాతావరణం నెలకొంది.
వేట సాగుతుంది ఇలా...
బాపట్ల మండలం రామానగర్, అడవిపల్లిపాలెం, కృపానగర్, ముత్తాయిపాలెం, దానవాయిపేటకు చెందిన మత్స్యకారులు మొత్తం సూర్యలంక సముద్ర తీరానికి చేరుకుంటున్నారు.
ఒక్కొక్క ఐలు వలను కనీసం 150 నుంచి 200 మంది మత్స్యకారులు లాగాల్సివస్తోంది.
మూడు విడతలుగా వేట సాగిస్తూ రెండు, మూడు గంటల్లో ఒక ఐలు వలకు చిక్కిన మొత్తం మత్స్య సంపదను ఒడ్డుకు చేరుస్తున్నారు.
ఓ వైపు చేపలతో నిండిన ఐలు వల లాగుతుంటే మరో వైపు మత్స్య సంపదను ట్రాక్టర్లకు లోడ్ చేస్తున్నారు. ఇలా సూర్యలంక సముద్ర తీరం సందడి సందడిగా మారింది.
పచ్చిచేపలు టన్ను రూ.10వేలు, ఎండబెట్టి విక్రయిస్తే టన్ను రూ.20వేలు చొప్పున ధర లభించనుంది. ఖర్చులన్నీపోనూ ఒక్కో మత్స్యకారునికి రోజుకు వెయ్యి రూపాయల కూలి గిట్టుబాటుఅవుతోంది.
రోజుకు ఒక్కొక్క ఐలు వలకు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు మత్స్యసంపద పడుతోంది.
ఇలా దీపావళి వరకు మత్స్యసంపద చిక్కే అవకాశం ఉందని మత్స్యకారులు బెబుతున్నారు.