చేపల చెరువుల లీజు చిచ్చు, ముగ్గురు మృతి
ఏలూరు : పచ్చని కొల్లేరులో చిచ్చు రేగింది. చేపల చెరువుల లీజు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా భీమడోలు మండలం చెట్టున్నపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుమారు 80 ఎకరాల చేపల చెరువుల లీజు విషయంపై గత ఏడాది కాలంగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. చేపల చెరువుపై వచ్చే ఆదాయం తమకు చెందాలంటే తమకే చెందాలని రెండు వర్గాలు కూడా పట్టుపడుతున్నాయి.
ఈ వివాదం ఆర్డీవో దృష్టి వరకు వెళ్లినా లాభం లేకపోయింది. గత ఏడాది ఈ వివాదం ముదిరి గ్రామంలోని ఒక వర్గానికి చెందిన 12 కుటుంబాలను వెలివేశారు. ఇదే విషయమైన ఆర్డీవో కోర్టులో వివాదం నడుస్తున్నా ఇంతవరకూ ఏమీ తేలలేదు. దీంతో రెండో వర్గానికి చెందిన కొందరు తమకు న్యాయం జరగట్లేదంటూ ... అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీసులు చర్యలు తీసుకునేలోపే ఫిర్యాదుచేసిన వారిపై ఇనుపరాడ్లు, కర్రలు, కత్తులతో దాడి జరిగింది.
ఈ ఘటనలో బొంతు జయరాజు, నేతల రంగరాజు, దేవదాసు లలిత మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.