నాన్నా.. ప్లీజ్, ఇంటికి వచ్చెయ్యి!
నాన్న విమానంలో వెళ్లారు.. ఆ విమానం కనిపించడం లేదు.. దేవుడా.. మా నాన్నను ఇంటికి పంపు.. నాన్నా.. త్వరగా ఇంటికి వచ్చెయ్యి అంటూ ఎయిర్ ఏషియా విమాన పైలట్ కెప్టెన్ ఇర్యాంటో కూతురు ఏంజెలా తన తండ్రి కోసం ప్రార్థిస్తోంది. తన ప్రార్థనను తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కూడా పోస్ట్ చేసింది. ఇండోనేషియాకు చెందిన ఇర్యాంటోతో పాటు ఫ్రాన్సుకు చెందిన మరో కో-పైలట్, ఐదుగురు కేబిన్ సిబ్బంది, 155 మంది ప్రయాణికులతో కూడిన విమానం తీవ్రమైన పొగమంచులో చిక్కుకుని.. ఆ తర్వాత కనపడకుండా అదృశ్యం అయిపోయిన విషయం తెలిసిందే. ప్రయాణికుల్లో ఒక పసికందు, 16 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
''నాన్నా.. ఇంటికి వచ్చెయ్యి.. నాకు నువ్వు కావాలి'' అని కెప్టెన్ ఇర్యాంటో కూతురు ఏంజెలా యాంగీ (22) తన పాత్ పేజిలో పోస్ట్ చేసింది. ఇది ఇండోనేషియా మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యింది. మా నాన్నను ఎవరైనా వెనక్కి తీసుకురండి అంటూ ఆమె చేసిన ఆక్రందన అందరి హృదయాలను కదిలించింది. ఆయన చాలా మంచి మనిషని, అందుకే గత రెండేళ్లుగా తమ ప్రాంత నైబర్హుడ్ చీఫ్గా ఆయన్నే ఎన్నుకొంటున్నారని ఇర్యాంటో పొరుగింటి స్నేహితుడు బాగియాంటో జోయోనెగోరో చెప్పారు. గతంలో వైమానిక దళంలో పనిచేసిన ఆయన ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా నడిపించారు.