దంపతులను మింగిన మగ్గం
ధర్మవరం అర్బన్: చేనేతల బతుకులు పోగుకు వేసే అతుకుల్లా మారుతున్నాయి. ఒక పక్క ఫవర్ లూమ్స్ దెబ్బ, మరో పక్క కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏ మాత్రం పనికిరాని చేతి మగ్గం... భవిష్యత్ ఉంటుందిలే అని చేసిన అప్పులు.. ఇవన్నీ కలసి దంపతుల బలవన్మరణానికి కారణమయ్యాయి. వారి పిల్లలను అనాధలను చేశాయి. వివరాలలోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నాలుగు మగ్గాలు వేసుకుని భార్యభర్తలు చట్టా రమేష్(35), చట్టా రమాదేవి(34) జీవిస్తుండేవారు.
సంవత్సర కాలం నుండి హ్యాండ్లూమ్ ధర పడిపోవడంతో కూలి మగ్గం వేసేందుకు కూడా ఎవరూ రావడం లేదు. దీంతో దంపతులిద్దరూ కలసి మగ్గాలు వేసినా ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో సుమారు నాలుగు లక్షల వరకు బయట అప్పులు చేశారు. కొద్దికాలంగా అప్పుల బాధ మరింత ఎక్కువ కావడంతో... చట్టా రమేష్ ఫిబ్రవరి 1వ తేదీన తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముందు రోజు రాత్రంతా అప్పులు తీర్చలేనని భార్యతో ఆవేదన వ్యక్తం చేసిన రమేష్.. తెల్లవారుజామున రైలు కింద పడేందుకు వెళుతుండగా... గమనించిన భార్య అపే ప్రయత్నం చేస్తుండగానే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క ళ్లెదుటే భర్తను పోగొట్టుకున్న రమాదేవి అప్పటి నుండి తీవ్ర మానసికవేదనకు గురైంది. ఈ క్రమంలో 12వ తేదీన భర్త పెద్ద కర్మ నిర్వహించిన ఆమె.. శుక్రవారం రాత్రి 7 గంటలకు పిల్లల్ని బయటకు పంపించి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తలు ఇద్దరూ చనిపోవడంతో... చిన్నారులు లతీష్, ఇందు అనాధలుగా మారారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.