flu disease
-
రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే
మాస్కో: రష్యాను ‘ఫ్లూ’ భయం వణికిస్తోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చాలామంది అంటువ్యాధి బారినపడినట్లు తెలిసింది. అధ్యక్ష భవనంలో అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి పనిచేసే సిబ్బందికి సైతం ఫ్లూ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పుతిన్‌ను అధికారులు రష్యా తూర్పు ప్రాంతంలోని ఉరాల్ పర్వతాల వెనుక ఉన్న ఓ బంకర్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం పుతిన్ అక్కడే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం వేడుకలను ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బంకర్లోనే జరుపుకుంటారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 70 ఏళ్ల పుతిన్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఏడాది రష్యా పార్లమెంట్ ఎగువ సభ డ్యుమాలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతి ఏటా సంవత్సరం ఆఖరున నిర్వహించే మీడియా సమావేశాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. పుతిన్ ఇలా మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వైఫల్యానికి సంబంధించి విలేకరులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకే ఆయన వార్షిక మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అమెరికాలో ఎవియన్ ఫ్లూ... 5 కోట్ల కోళ్లు బలి
వాషింగ్టన్: అమెరికాలో ఎవియన్ ఫ్లూ అక్షరాలా విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను బలి తీసుకుంది! ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనం జేబుకు మరింత చిల్లి పెడుతున్నాయి. హైలీ పాథోజెనిక్ ఎవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగు చూసింది. చూస్తుండగానే కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించి ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది! 2015లోనూ యూఎస్‌లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్‌తో సహా పలు యూరప్ దేశాల్లో కూడా ఎవియన్ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్‌లో పలు సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్ పెడుతున్నాయి! -
శతాబ్దానికో మహమ్మారి!
ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల శతాబ్దానికో అంటువ్యాధి ప్రబలుతుందనేది ఓ నమ్మిక. గత ఘటనలను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇది నిజమేనని నమ్మేందుకు తగిన ఆధారాలున్నాయి. ప్రస్తుతం కోవిడ్(కరోనా వైరస్) మాదిరిగానే 1720, 1820, 1920లలో కూడా ప్రపంచాన్ని అంటువ్యాధులు కుదిపేశాయి. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయని పరిశోధకులంటున్నారు. దీనిని బట్టి చూస్తే, స్వార్థం కోసం ఎవరైనా కావాలనే వీటిని సృష్టించి జనంపైకి వదులుతున్నారా? అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వ్యాధులు వస్తాయోననే భయం కలగకమానదని ‘ఏలియన్ న్యూస్’ అనే వెబ్ మీడియా పేర్కొంది. 1720లో ప్లేగు 1720లలో యూరప్ ప్రజలను బ్యుబోనిక్ ప్లేగ్ కలవరపెట్టింది. ఫ్రాన్సులోని మర్సెయిల్స్లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50వేల మందిని బలి తీసుకుంది. మొత్తమ్మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్ష మంది ఈ వ్యాధితో చనిపోయారు. 1820లో కలరా యూరప్‌ను అతలాకుతలం చేసిన ప్లేగుకు వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాల్లో ఈ వ్యాధి కూడా లక్ష మంది ఉసురుతీసింది. కలరా బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు. 1920లో స్పానిష్ ఫ్లూ ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచయమైన పేరు స్పానిష్ ఫ్లూ. 100 కోట్ల మంది ఈ బారినపడగా ఒక కోటి మంది మృత్యువాతపడ్డారు. మానవ జాతి చరిత్రలోనే పెనువిషాదం మిగిల్చిన భయంకర వ్యాధి ఇది. 2020లో కోవిడ్ స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. రోజులు గడిచేకొద్దీ ఈ వ్యాధి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. -
ఫెరల్ పిగ్స్ దాడి
శివ్‌పూర్‌లో సిటీ హంటర్ పందుల స్వైరవిహారం క్షతగాత్రుల్లో స్థానికులు, చిన్నారులు వేటాడాలని ఆదేశించిన అక్కడి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని శివ్పూర్ పట్టణ ప్రజలకు ఫెరల్ పిగ్స్ రూపంలో కొత్త ముప్పు వచ్చింది. వేల సంఖ్యలో పుట్టుకు వచ్చిన అడవి పంది జాతికి చెందిన ఈ జంతువుల దాడిలో పట్టణానికి చెందిన పెద్దలు, చిన్నారులు గాయపడ్డారు. వీటన్నింటికీ మించి ఈ పిగ్స్ కారణంగా ఆ ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలడంతో విషయం హైకోర్టు వరకు వెళ్లింది. తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఫెరల్ పిగ్స్ వేటకు ఆదేశించింది. దీంతో హైదరాబాద్‌కు చెందిన లెసైన్స్డ్ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ రంగంలోకి దిగారు. ఆరుగురు సభ్యులతో ఆపరేషన్ ప్రారంభించిన ఆయన గురు, శుక్ర, శనివారాల్లోనే 588 ఫెరల్ పిగ్స్‌ను హతమార్చారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 13 మ్యానీటర్లను వేటాడిన అనుభవం ఉన్న షఫత్ అలీ ఖాన్ శనివారం ‘సాక్షి’తో ఫోనులో మాట్లాడుతూ తాజా ఆపరేషన్ పూర్వాపరాలను తెలిపారు. శివ్‌పూర్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో మాదేవ్ నేషనల్ పార్క్ ఉంది. ఆ అరణ్యంలోని అడవి పందులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి సమీప గ్రామాల్లోని పెంపుడు పందులతో సంపర్కానికి పాల్పడ్డాయి. ఈ కారణంగా ఫెరల్ పిగ్స్ అనే జంతువులు పుట్టుకు వచ్చాయి. గడిచిన ఐదేళ్లలో వీటి సంతతి 15 నుంచి 20 వేల వరకు చేరింది. కాలక్రమంలో ఇవి శివ్పూర్ పట్టణం, శివార్లలోకి పెద్ద సంఖ్యలో ప్రవేశించాయి. ఒంటరిగా సంచ రించేపెద్దలు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులపై వరుస దాడులకు పాల్పడుతున్నాయి. వీటన్నింటికీ మించి ఈ ఫెరల్ పిగ్స్ కారణంగా శివ్‌పురి పరిసరాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ దుష్పరిణామాలకు ఫెరల్ పిగ్స్ కారణమని, తక్షణం నియంత్రించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శివ్ఫూర్కు చెందిన డాక్టర్ రాజేందర్ గుప్తా మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం లెసైన్స్డ్ హంటర్ సాయంతో వేల సంఖ్యలో ఉన్న ఆ జంతువులను మట్టుబెట్టాల్సిందిగా నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి నుంచి అనుభవజ్ఞుడైన హంటర్ కోసం ఆరా తీసిన అక్కడి ప్రభుత్వం గత ఆదివారం హైదరాబాద్‌కు చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్‌ను శివ్‌పూర్‌కు ఆహ్వానించింది. ఫెరల్ పిగ్స్‌ను సమూలంగా అంతమొందించాలని కోరుతూ ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించింది. ఆరుగురు సభ్యుల బృందంతో గురువారం నుంచి వేట ప్రారంభించిన షఫత్ అలీ ఖాన్ రెండు రోజుల్లో 588 ఫెరల్ పిగ్స్‌ను అంతమొందించారు. ఇంత భారీ సంఖ్యలో జంతువులను హతమార్చాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం, వాటిని వేటాడటం దేశంలోనే ఇది తొలిసారని నవాబ్ ‘సాక్షి’కి తెలిపారు. చంపిన ఫెరల్ పిగ్స్‌ను అక్కడి ప్రభుత్వసిబ్బంది పొక్లయిన్ల ద్వారా ఎత్తి, టిప్పర్లతో పట్టణ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి ఖననం చేస్తున్నారని వివరించారు. ఈ ఆపరేషన్ దాదాపు నెల రోజుల పాటు సాగే అవకాశం ఉందని చెప్పారు.