
ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల శతాబ్దానికో అంటువ్యాధి ప్రబలుతుందనేది ఓ నమ్మిక. గత ఘటనలను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇది నిజమేనని నమ్మేందుకు తగిన ఆధారాలున్నాయి. ప్రస్తుతం కోవిడ్(కరోనా వైరస్) మాదిరిగానే 1720, 1820, 1920లలో కూడా ప్రపంచాన్ని అంటువ్యాధులు కుదిపేశాయి. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయని పరిశోధకులంటున్నారు. దీనిని బట్టి చూస్తే, స్వార్థం కోసం ఎవరైనా కావాలనే వీటిని సృష్టించి జనంపైకి వదులుతున్నారా? అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వ్యాధులు వస్తాయోననే భయం కలగకమానదని ‘ఏలియన్ న్యూస్’ అనే వెబ్ మీడియా పేర్కొంది.
1720లో ప్లేగు
1720లలో యూరప్ ప్రజలను బ్యుబోనిక్ ప్లేగ్ కలవరపెట్టింది. ఫ్రాన్సులోని మర్సెయిల్స్‌లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50వేల మందిని బలి తీసుకుంది. మొత్తమ్మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్ష మంది ఈ వ్యాధితో చనిపోయారు.
1820లో కలరా
యూరప్‌ను అతలాకుతలం చేసిన ప్లేగుకు వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాల్లో ఈ వ్యాధి కూడా లక్ష మంది ఉసురుతీసింది. కలరా బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు.
1920లో స్పానిష్ ఫ్లూ
ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచయమైన పేరు స్పానిష్ ఫ్లూ.
100 కోట్ల మంది ఈ బారినపడగా ఒక కోటి మంది మృత్యువాతపడ్డారు. మానవ జాతి చరిత్రలోనే పెనువిషాదం మిగిల్చిన భయంకర వ్యాధి ఇది.
2020లో కోవిడ్
స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. రోజులు గడిచేకొద్దీ ఈ వ్యాధి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది.