సాక్షి సిటీబ్యూరో: భాగ్యనగరం.. ప్రేమ పునాదులపై నిర్మితమైన మహానగరం.. చరిత్ర పుటలు తిరిగేస్తే అనేక వ్యాధులను ఎదుర్కొని మహోన్నతంగా ఎదిగింది. 15వ శతకంలో ప్లేగు వ్యాధి నివారణ సూచికగా నిర్మించిన చార్మినార్ చరిత్రకు సజీవ సాక్షిగా నిలిచింది. 4 శతాబ్దలుగా విపత్తులు, వరదలను, వ్యాధులను తట్టుకొని నేటికీ సజీవంగా నిలిచింది. ఇదిలా ఉండగా భాగ్యనగర పొలిమేరల్లోకి మహమ్మారి వ్యాధులు జొరపడటం కొత్తేమీ కాదు.! కలరా (గత్తర), ప్లేగు, మశూచి వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు నగరాన్ని గతంలో చుట్టుముట్టాయి. నగరం ఏర్పాటు నుంచి నేటికి వచ్చిన వరదలు, వ్యాధులు, విపత్తుల నివారణకు తీసుకున్న చర్యలపై సాక్షి ప్రత్యేక కథనం..
భయపెట్టిన వ్యాధులు..వరదలు
1631, 1831, 1903, 1908 సంవత్సరాల్లో భారీ వరదలు.. వ్యాధులు నగరాన్ని చిగురుటాకులా ఒణికించాయి. అందులో ప్లేగు, కలరా ప్రధానమైనవి. 1911లో కలరా మహమ్మారి నగర ప్రజలను తీవ్రస్థాయిలో నష్టం కల్గించింది. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ఇన్ ఫ్లూ ఎంజా వ్యాధి ప్రబలింది. 1919లో ఫ్లూతో కొన్నివందల మంది మంచం పట్టారు. వ్యాధులు సోకినప్పుడల్లా ప్రభుత్వం అప్పటి వైద్య విధానంతో వైద్యం చేసి వందల మంది ప్రాణాలను కాపాడింది. ఆ రోజుల్లో తాగునీరు కోసం నగరమంతా చేదుడు బావుల మీదే ఆధారపడాల్సిన స్థితి. దాంతో సులువుగా కలరా, ప్లేగు అంటు వ్యాధులు ఒకరినుంచి మరొకరికి సులువుగా ప్రబలేవని చారిత్రక పుస్తకాల ద్వారా తెలుస్తుంది.
నగర మొదటి ఆసుపత్రి
హైదరాబాద్ పునాదులు పడ్డాక దశాబ్దకాలంలోపే ఈ నేలపై ‘‘దారుషిఫా’ యునాని ఆస్పత్రి పురుడుపోసుకుంది. రెండు అంతస్తుల ఆస్పత్రి భవనంలో మశూచి, క్షయ ప్రాణాంతక రోగాలకూ చికిత్స అందించేవారని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడవుతుంది. అప్పటి ఇరాన్, పర్షియా, యూరోపిన్, అరేబియన్ వైద్య విధానం ద్వారా అన్ని రకాల వ్యాధులకు నివారణ జరిగేదని ప్రముఖ చరిత్రకారులు అల్లామా ఏజాజ్ ఫరూఖీ తెలిపారు. ఈ ఆసుపత్రిలో ఔట్‌పేషంట్స్‌తో పాటు ఇన్‌పేషంట్స్ సౌలభ్యం ఉండేవి. వివిధ దేశాల నుంచి వైద్యులు వచ్చి ఈ ఆసుపత్రిలో రోగాల నివారణకు ప్రయోగాలు చేసేవారని చరిత్రకారులు చెబుతారు.
మూఢనమ్మకాల నివారణకు అవగాహన
ప్రజల ప్రాణాలను తీస్తున్న మహమ్మారి రోగాలు పోవాలంటే జంతు బలులు, యజ్ఞాలు వంటి కార్యక్రమాలను చాలామంది నిర్వహించేవారు. వాటితో నగరంలో చెత్త, చెదారం పెరిగి గాలి, నీరు కలుషితం మరింత ఎక్కువ కలుషితం అయ్యేవి. తద్వారా వ్యాధులు మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వం ద్వారా విశేష కృషి చేశారు. గాలి, నీరుతో అంటువ్యాధులు అత్యంత సులువుగా సోకే రోజులవి. మనుషులు పిట్టల్లా రాలుతోన్న కాలమది.! ప్లేగుతో కన్నుమూసిన వ్యక్తి భౌతిక కాయాన్ని సొంత కుటుంబ సభ్యులే తాకేందుకు భయపడే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే, ఆ రోజుల్లో కొన ఊపిరితో ఉన్న రోగులను ఇంటికి దూరంగా వదిలేసేంత కాఠిన్యం. అలాంటి స్థితిలో సామాజిక స్పృçహ ఉన్న కొందరు యువకులను పోగు చేశారు. వారంతా కలిసి అనాథ శవాలకు దహనసంస్కారాలు నిర్వహించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో భాగంగా జనావాసాలమధ్య చెత్త, చెదారాలను తొలగించారు. రోడ్డుకి ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ ను చల్లించారు.
నగరానికి దర్వాజాలు..
హైదరాబాద్ నగరం ఏర్పాటు అనంతరం 1734లో రెండో నిజాం నిజాం అలీఖాన్ పాలనలో నగరం రక్షణ కోసం నగరం చుట్టూ 12 దర్వాజాలతో ప్రహరీ కట్టారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాకపోకల కోసం దర్వాజాలు తెరిచి రాత్రి వేళల్లో దర్వాజాలు మూసివేసేవారు. నగరంలో అంటు వ్యాధులు, ఫ్లూలు ప్రబలినప్పుడు నగర దర్వాజాలు మూసి వేసేవారు. నగర ప్రజలకు వేరే ప్రాంతాలకు వెళ్లనిచ్చే వారు కాదు, వేరే ప్రాంతాల వారిని నగరంలో రాకుండా నివారించే వారు. వ్యాధులు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకునేవారు. ఫలితంగా రోగం తగ్గుముఖం పట్టడమే కాదు, రోగుల్లోనూ తమకేమీ కాదనే కొండంత ధైర్యం.
ఉచిత వైద్య శిబిరాలు
1925లోనూ నగరంలో ప్లేగు ప్రబలిన సందర్భంలో ప్రభుత్వం సహకారంతో పలు స్వచ్చంద సంస్థలు రోగులకు అసాధారణమైన సేవలు అందించింది. ఉచితంగా వైద్య శిబిరాలనూ నిర్వహించారు. ఉచితంగా మందులనూ పంచారు. కలరా, ప్లేగు బాధితుల కోసం ఉచిత సహాయ కేంద్రాలను నెలకొల్పారు. రోగులకు శుశ్రూష చేస్తూ, ఉచితంగా వైద్య సేవలను అందించారు. బాధితులకు సాయంచేయడంలో నిమగ్నమైన సాటి మనిషికి సాయం చేయడమే మనిషితత్వం అని విశ్వసించిన. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్లేగు వ్యాధిగ్రస్తుల సేవలో నిమగ్నమయ్యారు. పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు చాలామంది యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ఫ్లూపై సమరం సలిపిన మెడికల్ వలెంటీర్లను అప్పటి నిజాం ప్రభుత్వం బంగారు, వెండి నాణేలతో సత్కరించింది.
గోల్కొండ నిర్మాణం గోల్కొండ కోట కుతుబ్‌షాహీల అధీనంలో ఉండేది. కోటలో జనజీవనం విపరీతంగా పెరగడంతో ప్రజలు ప్లేగ్ వ్యాధి బారినపడ్డారు. 1589లో 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. ఈ నగరాన్ని మూసీ నది దక్షిణ ఒడ్డున నిర్మించాలని నిర్ణయం జరిగింది. గోల్కొండ రాజ్యంలో ప్లేగు వ్యాధి తగ్గినందుకు సంతోషంతో ప్రసిద్ధి చెందిన చార్మినార్ కట్టడాన్ని 1592లో నిర్మించారు. అనంతరం కోటను వదలిన ప్రజలు చార్మినార్ చుట్టుపక్కల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment