cholera diseases
-
అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?...
ఖట్మండు: నేపాల్‌లోని ఖాట్మండు వ్యాలీలో పానీ పూరీ అమ్మకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే పానీ పూరీ అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కలరా రోగుల సంఖ్య 12కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ కలరా వ్యాప్తిని అరికట్టేందుకు మహానగరాల్లోనూ, రద్దీ ప్రాంతాలు, కారిడార్ వంటి ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిషేధించారు. అంతేకాదు ఎవరికైన కరోనా లక్షణాలు కనిపించినట్లయితే సమీప ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని ప్రజలను అధికారులు కోరారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో డయేరియా, కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. (చదవండి: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ) -
శతాబ్దానికో మహమ్మారి!
ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల శతాబ్దానికో అంటువ్యాధి ప్రబలుతుందనేది ఓ నమ్మిక. గత ఘటనలను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇది నిజమేనని నమ్మేందుకు తగిన ఆధారాలున్నాయి. ప్రస్తుతం కోవిడ్(కరోనా వైరస్) మాదిరిగానే 1720, 1820, 1920లలో కూడా ప్రపంచాన్ని అంటువ్యాధులు కుదిపేశాయి. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయని పరిశోధకులంటున్నారు. దీనిని బట్టి చూస్తే, స్వార్థం కోసం ఎవరైనా కావాలనే వీటిని సృష్టించి జనంపైకి వదులుతున్నారా? అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వ్యాధులు వస్తాయోననే భయం కలగకమానదని ‘ఏలియన్ న్యూస్’ అనే వెబ్ మీడియా పేర్కొంది. 1720లో ప్లేగు 1720లలో యూరప్ ప్రజలను బ్యుబోనిక్ ప్లేగ్ కలవరపెట్టింది. ఫ్రాన్సులోని మర్సెయిల్స్లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50వేల మందిని బలి తీసుకుంది. మొత్తమ్మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్ష మంది ఈ వ్యాధితో చనిపోయారు. 1820లో కలరా యూరప్‌ను అతలాకుతలం చేసిన ప్లేగుకు వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాల్లో ఈ వ్యాధి కూడా లక్ష మంది ఉసురుతీసింది. కలరా బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు. 1920లో స్పానిష్ ఫ్లూ ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచయమైన పేరు స్పానిష్ ఫ్లూ. 100 కోట్ల మంది ఈ బారినపడగా ఒక కోటి మంది మృత్యువాతపడ్డారు. మానవ జాతి చరిత్రలోనే పెనువిషాదం మిగిల్చిన భయంకర వ్యాధి ఇది. 2020లో కోవిడ్ స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. రోజులు గడిచేకొద్దీ ఈ వ్యాధి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. -
కేరళకు మరో ముప్పు పొంచి ఉందా?
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతున్న కేరళకు మరో ముప్పు పొంచిఉందా? వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందా? అంటే వైద్య నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కేరళ ప్రజలు ఇప్పటికే చికున్‌గన్యా, డెంగ్యూ వాధులతో అల్లాడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా తమ రాష్ట్రానికి అత్యవసర మందుల్ని అందించి ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ప్రైవేటు ఆసుపత్రులకు కేరళ లేఖ రాసింది. జ్వరం, డయేరియా మందులు పంపండి కేరళలోని 481 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 137 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 19 డిస్పెన్సరీల్లో మందులు నిండుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సదానందన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా జ్వరం, దగ్గు, జలుబు, డయేరియా, హైపర్‌టెన్షన్ వంటి రోగాలకు అవసరమైన మందుల్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రైవేటు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం వెంటనే స్పందించింది. విజయన్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేరళకు కావాల్సిన అన్నిరకాల మందుల్ని వైమానిక మార్గం ద్వారా పంపిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోజ్ ఝలానీ తెలిపారు. అలాగే ప్రజలకు సాయం అందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం పిలుపు మేరకు మెడిట్రినా ఆసుపత్రి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులకు తమ వైద్యులను, మందులతో పంపుతున్నట్లు మెడిట్రినా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో పీఎన్ మంజు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరదల కారణంగా మందులు దెబ్బతినడంతో వైద్యులు రోగులకు ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఎంఎస్) ఔట్ పేషంట్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ విషయమై అమృత ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ..‘వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి రాలేకపోతున్నారు. మా ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ వరదనీటితో నిండిపోయింది. ఇప్పుడు ఆసుపత్రిలో 900 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వీరిలో 150 మంది ఐసీయూలో ఉన్నారు. ఆసుపత్రిలో విద్యుత్, మంచినీటి సరఫరాను కొనసాగించేందుకు మేమంతా పోరాడుతున్నాం. అదనంగా మరో 300 మందిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందజేస్తున్నాం. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని తెలిపారు. -
రాష్ట్రానికి విషజ్వరం!
విజృంభిస్తున్న మలేరియా, డెంగీ, కలరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. సాధారణ జ్వరాలతోపాటు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా పంజా విసురుతున్నాయి. వర్షాలు కురుస్తుండడం, పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరికొండలో సిద్ధార్థ అనే విద్యార్థి మెదడు వ్యాపు వ్యాధి సోకి చనిపోయాడు. చాలా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విష జ్వరాలు, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. కొందరు కలరా బాధితులు ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది జ్వరాల కేసులు నమోదయ్యాయని, వందలాది మంది మలేరియా, డెంగీ, చికున్‌గున్యాలతో బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఏజెన్సీలో జూన్ 1 నుంచి16వ తేదీ వరకు 7 వేల మంది జ్వరాల బారిన పడ్డారని అక్కడి అధికారులు తేల్చారు. అందులో 18 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారించారు. ఈ సంఖ్య రెండింతలకు పైగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. దోమ తెరల పంపిణీపై నిర్లక్ష్యం మలేరియా అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఏటా దోమ తెరలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ చివరగా 2012లో దోమ తెరలను పంపిణీ చేశారు. తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేయకపోవడంతో దోమల వల్ల వచ్చే వ్యాధులు రెండింతలకుపైగా నమోదైనట్లు అంచనా. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లే దోమ తెరలను పంపిణీ చేయలేకపోయామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మలేరియా అత్యధికంగా ఉండే ప్రాంతాలకు 3 లక్షల వరకు దోమ తెరలు సరఫరా చేయాల్సి ఉంది. డెంగీ వస్తే అంతే సంగతులు రాష్ట్రంలో సుమారు 2 వేల మలేరియా పీడిత గ్రామాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. జ్వరాలతో వచ్చే బాధితులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తున్నాయి. డెంగ్యూ సోకితే సాధారణ వైద్యంతో నయం చేసే అవకాశమున్నా ప్లేట్లె ట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. ప్లేట్లెట్లు 10 వేలలోపును తగ్గితేనే ఎక్కించాలి. కానీ 20 వేల నుంచి 50 వేల వరకు ఉన్నవారికి కూడా ప్లేట్లెట్లు ఎక్కిస్తూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు. నగరంలో రెండు నెలల్లో 10 కలరా కేసులు నమోదయ్యాయని అంటువ్యాధుల విభాగం అధికారిణి సుబ్బలక్ష్మి తెలిపారు.