విజృంభిస్తున్న మలేరియా, డెంగీ, కలరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. సాధారణ జ్వరాలతోపాటు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా పంజా విసురుతున్నాయి. వర్షాలు కురుస్తుండడం, పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరికొండలో సిద్ధార్థ అనే విద్యార్థి మెదడు వ్యాపు వ్యాధి సోకి చనిపోయాడు. చాలా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విష జ్వరాలు, మలేరియా కేసులు నమోదవుతున్నాయి.
కొందరు కలరా బాధితులు ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది జ్వరాల కేసులు నమోదయ్యాయని, వందలాది మంది మలేరియా, డెంగీ, చికున్‌గున్యాలతో బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఏజెన్సీలో జూన్ 1 నుంచి16వ తేదీ వరకు 7 వేల మంది జ్వరాల బారిన పడ్డారని అక్కడి అధికారులు తేల్చారు. అందులో 18 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారించారు. ఈ సంఖ్య రెండింతలకు పైగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
దోమ తెరల పంపిణీపై నిర్లక్ష్యం
మలేరియా అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఏటా దోమ తెరలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ చివరగా 2012లో దోమ తెరలను పంపిణీ చేశారు. తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేయకపోవడంతో దోమల వల్ల వచ్చే వ్యాధులు రెండింతలకుపైగా నమోదైనట్లు అంచనా. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లే దోమ తెరలను పంపిణీ చేయలేకపోయామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మలేరియా అత్యధికంగా ఉండే ప్రాంతాలకు 3 లక్షల వరకు దోమ తెరలు సరఫరా చేయాల్సి ఉంది.
డెంగీ వస్తే అంతే సంగతులు
రాష్ట్రంలో సుమారు 2 వేల మలేరియా పీడిత గ్రామాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. జ్వరాలతో వచ్చే బాధితులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తున్నాయి. డెంగ్యూ సోకితే సాధారణ వైద్యంతో నయం చేసే అవకాశమున్నా ప్లేట్‌లె ట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారు. ప్లేట్‌లెట్లు 10 వేలలోపును తగ్గితేనే ఎక్కించాలి. కానీ 20 వేల నుంచి 50 వేల వరకు ఉన్నవారికి కూడా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు. నగరంలో రెండు నెలల్లో 10 కలరా కేసులు నమోదయ్యాయని అంటువ్యాధుల విభాగం అధికారిణి సుబ్బలక్ష్మి తెలిపారు.
రాష్ట్రానికి విషజ్వరం!
Published Sun, Jul 10 2016 2:51 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement
Advertisement