flud
-
వరదలపై అప్రమత్తం
l గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్‌గా ఉండాలి l ముంపు మండలాల వారికి సహకరించాలి l భద్రాద్రిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం భద్రాచలం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలొస్తే..ఎదుర్కొనేందుకు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం ఐటీడీఏ పీఓ చాంబర్లో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, పీఓ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ..ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత, పెన్‌గంగ, ఇంద్రావతితో పాటు పెద్దఎత్తున వరద నీరు గోదావరిలో కలుస్తోందని, సోమవారం నాటికి సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు భద్రాచలం వద్దకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది 52 అడుగులకు ప్రవాహం చేరిందని గుర్తు చేశారు. డివిజనల్, మండల అధికారులు హెడ్ క్వార్ట్‌ర్స్‌లో ఉండాలని, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో ఫో¯ŒSలో మాట్లాడానని, ప్రభుత్వం నుంచి హెలీకాప్టర్, ఆర్మీ బృందాలు కావాలంటే కలెక్టర్, ఎస్పీకి అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, సీడబ్ల్యూసీ వారి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారులకు సమాచారం అక్కడి ప్రజలను కాపాడేందుకు సహకరించాలని సూచించారు. తాను సమావేశానికి వస్తున్నానని తెలిసినా కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలకు ఆదేశించారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జెడ్పీ సీఈఓ నగేష్, డీఎస్ఓ ఉషారాణి, డీఈఓ నాంపల్లి రాజేష్, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు, డీపీఓ నారాయణ, కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మున్నేరు..పరవళ్లు
ఉప్పొంగిన వాగులు.. జలకళ నింపుకున్న చెరువులు వాన దంచికొట్టింది. వరద ఉరకలెత్తింది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు..వరదతో పోటెత్తాయి. కిన్నెరసాని గలగలాపారుతూ హొయలు పోయింది. గరిష్ట నీటిమట్టానికి చేరి నిండుకుండలా మారింది. వైరా జలాశయం కొత్త నీటితో కళకళలాడింది.ఽ గూడెం వద్ద ముర్రేడు వాగు ఉప్పొంగుతూ..ఉధృతంగా సాగింది. మున్నేరు వరదతో పోటెత్తింది. పాఖాల వాగు, బయ్యారం పెద్ద చెరువు, ఆకేరు జలహోరు తోడవడంతో ఉరకలెత్తింది. తాలిపేరు గేట్ల నుంచి జలధార ఎగసి పడింది. అటు ఏజెన్సీ..ఇటు మైదాన ప్రాంతాలన్నీ తడిసిముద్దయ్యాయి. ఎడతెరపి లేని వాన..తోడైన వరదతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినా..పంటలకు, సాగుకు భరోసా లభించిందని రైతులు పరవశించారు. ఖమ్మం గాంధీచౌక్: మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతం పాఖాల వాగు, బయ్యారం పెద్ద చెరువు నుంచి అలిగేరు, ఆకేరు వాగుల నీరు మున్నేరులో కలుస్తుండడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రం ఖమ్మం వద్ద వరదను నగర ప్రజలు తరలొచ్చి తిలకించారు.కాల్వొడ్డు, ట్రంక్ రోడ్, సారధీనగర్, రాపర్తినగర్ ప్రాంత ప్రజలు సమీపంలోని మూడు వంతెనలపై నుంచి వరద ఉధృతిని తిలకించారు. -
గోదావరి తగ్గుముఖం
భద్రాచలం వద్ద 29 అడుగుల నీటిమట్టం భద్రాచలం: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. గురువారం 33 అడుగులకు చేరుకోగా, నెమ్మదిగా తగ్గుతూ శుక్రవారం సాయంత్రం భద్రాచలం వద్ద 29 అడుగుల నీటిమట్టానికి చేరింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి ప్రవాహం గోదావరిలోకి లేకపోవడంతో ఇప్పట్లో వరద భయం లేదని భద్రాచలం నీటిపారుదల శాఖ డీఈ రాంప్రసాద్ తెలిపారు. భద్రాచలం వద్ద స్నానఘాట్ విశాలంగా ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలగలేదు. నదిలో పడవలపై గజ ఈతగాళ్లను అధికారులు అందుబాటులో ఉంచారు. -
ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద ఉధృతి
144.50 మీటర్లకు చేరిన నీరు ముంపు గ్రామాలు ఖాళీ చేయాలని జేసీ ఆదేశాలు మంచిర్యాల రూరల్ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీగా నిండుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు కడెం ప్రాజెక్ట్ గేట్లు తీయడంతో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్ట్‌కు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి మట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా శనివారం రాత్రి 8 గంటల వరకు 144.50 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 11.98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా, ప్రస్తుతానికి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 6,400ల క్యూసెక్కుల కాగా 521 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో 147 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు ఆ దిశగా ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని జేసీ సుందర్ అబ్నార్ నిర్వాసితులను ఆదేశించారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, రాపల్లి, కొడపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నిర్వాసితులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. నీటిమట్టం 145.50 మీటర్లకు పెరిగితే చందనాపూర్ నీట మునిగే ప్రమాదం ఉంది.