వరదలపై అప్రమత్తం
-
l గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్‌గా ఉండాలి
-
l ముంపు మండలాల వారికి సహకరించాలి
-
l భద్రాద్రిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
భద్రాచలం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలొస్తే..ఎదుర్కొనేందుకు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం ఐటీడీఏ పీఓ చాంబర్‌లో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, పీఓ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ..ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత, పెన్‌గంగ, ఇంద్రావతితో పాటు పెద్దఎత్తున వరద నీరు గోదావరిలో కలుస్తోందని, సోమవారం నాటికి సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు భద్రాచలం వద్దకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది 52 అడుగులకు ప్రవాహం చేరిందని గుర్తు చేశారు. డివిజనల్, మండల అధికారులు హెడ్ క్వార్ట్‌ర్స్‌లో ఉండాలని, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో ఫో¯ŒSలో మాట్లాడానని, ప్రభుత్వం నుంచి హెలీకాప్టర్, ఆర్మీ బృందాలు కావాలంటే కలెక్టర్, ఎస్పీకి అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, చింతూరు, వీఆర్‌పురం మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, సీడబ్ల్యూసీ వారి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారులకు సమాచారం అక్కడి ప్రజలను కాపాడేందుకు సహకరించాలని సూచించారు. తాను సమావేశానికి వస్తున్నానని తెలిసినా కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలకు ఆదేశించారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జెడ్పీ సీఈఓ నగేష్, డీఎస్‌ఓ ఉషారాణి, డీఈఓ నాంపల్లి రాజేష్, డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావు, డీపీఓ నారాయణ, కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.