దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా నేడు (గురువారం) ఐటీఓ కూడలిలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రచారం సాగనుంది. 28న బరాఖంబలో, అక్టోబర్ 30న చంద్‌గిరామ్ అఖారా కూడలి, నవంబర్ 2న మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రచారం సాగనుంది.
ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ఈసారి ఐటీఓ కూడలి నుంచి ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 3వ తేదీన 2000 ఎకో క్లబ్‌ల ద్వారా చిన్నారులకు కూడా అవగాహన కల్పించనున్నామన్నారు. 2020వ సంవత్సరంలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ ప్రచారం ప్రారంభించారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు 2019 సంవత్సరంలో దీనిపై అధ్యయనాన్ని నిర్వహించారు.
ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. కూడలి సిగ్నల్ వద్ద రెడ్ లైట్ కనిపించినప్పుడు వాహనాల ఇంజిన్‌లను స్విచ్ ఆఫ్ చేయని పక్షంలో తొమ్మిది శాతం అధికంగా కాలుష్యం వ్యాపిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో వాహనదారులు 10 నుండి 12 రెడ్ లైట్ల గుండా వెళుతుంటారు. ఈ కూడళ్లలో వాహనం ఇంజన్ రన్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా 25 నుంచి 30 నిమిషాల పాటు అనవసరంగా పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చయి, పొగ రూపంలో కాలుష్యం వ్యాపిస్తుంది. అందుకే కూడలిలో రెడ్ లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ అపాలని ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నారు. కాగా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారుతోంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి!
Comments
Please login to add a commentAdd a comment