ఇసుక ర్యాంపులపై దాడులు
ఇసుక ర్యాంపులపై దాడులు
Published Wed, May 3 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
- 1062 క్యూబిక్ మీటర్ల ఇసుక స్వాధీనం
- కలెక్టర్ కార్తికేయ ఆదేశాలతో కదిలిన భూగర్భ గనులశాఖ యంత్రాంగం
- ‘సాక్షి’ ఫోకస్‌కు ఎఫెక్ట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కపిలేశ్వరపురం: అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్న అక్రమార్కులపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపించింది. జిల్లాలో అనుమతి లేని ఇసుక ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలించి లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్న ఇసుక దందాను గత నెల 23న ‘ప్రతిరేణువుకూ రేటే’ శీర్షికన ‘సాక్షి ఫోకస్’ ద్వారా ఫొటోలతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక సమాచారం రప్పించుకున్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పందించారు. గనులు, భూగర్భజల శాఖాధికారులతో ఇసుక ర్యాంపుల తనిఖీలు జరపాలంటూ ఆదేశించారు. ఈ మేరకు సంబంధితశాఖలోని రెగ్యులర్, విజిలెన్స్ విభాగాలకు చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, స్థానిక రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు.
సాక్షి పత్రికే అజెండా...
జిల్లాలోని మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం, కోరుమిల్లి, తాతపూడి, రాజమహేంద్రవరం కుమారి టాకీస్, వేమగిరి, కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం, అంకంపాలెం, జొన్నాడ, మందపల్లి, తునిలో తాండవ నది తదితర ర్యాంపుల్లో ఇసుకను అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో ఇసుక అక్రమాలు అధికంగా జరుగుతున్న కపిలేశ్వరపురం మండలంలోని పలు ర్యాంపులపై దాడులు నిర్వహించారు. మైన్స్ శాఖ రాజమహేంద్రవరం ఆర్‌ఐ ఎస్.లక్ష్మీనారాయణ, మైన్స్ విజిలెన్స్ (రాజమహేంద్రవరం) ఆర్‌ఐ పి.మురళి ఆధ్వర్యంలోని బృందం కోరుమిల్లి, కపిలేశ్వరపుర, మాచర గ్రామాల్లో దాడులు నిర్వహించి ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మొదట తాతపూడి ర్యాంపును తనిఖీ చేశారు. యూనిట్ ఇసుక రూ.750లకు బదులు రూ.1100లు విక్రయిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇలాగే ధరలు పెంచి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు అక్కడి నిర్వాహకులను హెచ్చరించారు.
సీజ్ చేసిన 1062 క్యూబిక్ మీటర్ల ఇసుక...
కోరుమిల్లి, కపిలేశ్వరపురం ర్యాంపుల పరిధిలో పరిసర గ్రామాల్లో వీఆర్వోలతో కలిసి తనిఖీలు నిర్వహించి 13 గుట్టలుగా ఉన్న 1062 క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేశారు. కోరుమిల్లి ఆరోగ్య ఉప కేంద్రం, శివాలయం, మాచర శివారుల్లో పలు గుట్టలను గుర్తించారు. ఇసుకను లారీలో లోడింగ్ చేసినప్పుడు ఒక యూనిట్ అదనంగా వేయించుకుని నిల్వ చేసుకుని లాభపడుతున్నారని తేల్చారు. కపిలేశ్వరపురం–2 ర్యాంపు సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో ఇసుక గుట్టలను స్వాధీనం చేసుకుని వీఆర్వోలు తవిటికి సత్యనారాయణ, వెంకటరమణకు అప్పగించారు.
దేశం నేతల పైరవీలు...
ఆరోగ్య ఉప కేంద్రం వద్ద నిల్వలను స్వాధీనం చేసుకుంటుండగా అధికార పార్టీ నేతలు కొందరు అడ్డంపడ్డారు. ఇంటి పునాదులు కోసం నిల్వ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. పునాదులకు ఉచిత ఇసుకను వినియోగించడం నిబంధనలకు విరుద్ధమంటూ ఆ నిల్వలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి నిర్మాణాల కోసం తెచ్చుకున్న వాటిని అక్రమం నిల్వలుగా నిర్ధారించడం సరికాదని వాదనకు దిగారు. ఇంటి నిర్మాణ ప్రదేశంలో లేని నిల్వలను స్వాధీన పర్చుకుంటామన్నారు. నిర్మాణం జరుగుతున్నట్టు వీఆర్వోల సమక్షంలో నిరూపించుకుంటే తిరిగి నిల్వలను వినియోగించుకోవచ్చని మైన్స్ అధికారులు వారికి చెప్పారు..
ఈ సందర్భంగా మైన్స్ ఆర్‌ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 5తో కోరుమిల్లి–2, మార్చి–31తో కోరుమిల్లి–1 ర్యాంపులకు గడువు ముగిసిందన్నారు. కపిలేశ్వరపురం–1 ర్యాంపు 2018 ఫిబ్రవరి 16, తాతపూడి ర్యాంపు 2017 నవంబరు 27 వరకు అనుమతి ఉందన్నారు. త్వరలో కపిలేశ్వరపురం–3, కోరుమిల్లి–2, కేదారిలంక ర్యాంపులపై కసరత్తు జరుగుతోందన్నారు. ఈ దాడుల్లో ఎంపీడీఓ వి.అబ్రహంలింకన్, తహసీల్దారు కేపీ నరసింహులు, అంగర ఎస్సై వాసా పెద్దిరాజు, గోదావరి హెడ్ వర్క్స్ ఏఈ డి.రాధాకృష్ణ, వీఆర్వోలు ఎస్.సత్యనారాయణ, వీరబాబు, టి.సత్యనారాయణ, వెంకటరమణలతో కలిసి మైన్స్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement