భయాందోళనలో చంద్రబాబు
భయాందోళనలో చంద్రబాబు
Published Sun, Mar 5 2017 10:36 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ప్రయత్నం
అర్థం లేని నిర్ణయాలతో పేదలకు రేషన్ అందకుండా చేస్తున్నారు
సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
సీతానగరం (రాజానగరం): ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర భయాందోళనలో ఉన్నారని, అందుకే అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేందుకు పూనుకుంటున్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసి ఏడాది పూర్తి కావొస్తోందన్నారు. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. రేషన్ షాపుల్లో క్యాష్‌లెస్ విధానం అంటు లబ్ధిదారులకు సరుకులు అందించకుండా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలు ప్రవేశపెట్టింది రేషన్ సరుకులు నిలిపివేయడానికేనని ఆరోపించారు. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను వైఎస్సార్ సీసీ బయట పెట్టడంతో, తమను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రజల దృష్టిలో దోషులుగా నిలిచారని చెప్పారు. బస్సు ప్రమాదంలో జేసీ బ్రదర్స్‌ను కాపాడేందుకు చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు తమ పార్టీ నాయకుల్ని కాపాడుకునేందుకు చూస్తున్నారే తప్ప ప్రజా సేవను పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. ఇసుక, మట్టి వ్యాపారం చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ దందా వంటి పలు అక్రమాలకు పాల్పడడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టి, పాలన పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనేఉన్నాయన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్ బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్ళమళ్ళ సుజీరాజు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు
Advertisement