ఆగని వదంతులు..!
ఆగని వదంతులు..!
Published Wed, Mar 29 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
రూ.10నాణేలు చెల్లుబాటు కావంటూ పుకార్లు ∙
తీసుకోవడానికి నిరాకరిస్తున్న వ్యాపారులు ∙
అటువంటిదేమీ లేదంటున్న బ్యాంకర్లు
రాయవరం : పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉంది. రూ.10నాణేలను తీసుకునేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తుండగా..నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం వదంతులేనని బ్యాంకర్లు కొట్టిపడేస్తున్నారు.
నోట్ల రద్దు నుంచి..
గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ అదే పరిస్థిథి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల నాణేలు చెల్లవని ఆటోవాలాలు, చిరు వ్యాపారులు, పండ్లు, కూరగాయలు, పాల వ్యాపారులు..ఇలా ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. రూ.10నాణేలు వచ్చిన కొత్తలో, ఆ తర్వాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా మంది వ్యాపారులు మూటలు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న పుకార్లతో వారు ఆ నాణేలను బయటకు తీస్తున్నారు. అయితే వీటిని తీసుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీని వల్ల చిన్న చిన్న తగాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి చిల్లరగా కండక్టర్లు రూ.10నాణేలు ఇస్తే అటు ప్రయాణికులు..ఇటు కండక్టర్లు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.
రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయి..
రూ.10 నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం అపోహలు మాత్రమే. రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని రూ.10నాణేల మారకాన్ని వినియోగించుకోవాలి.
– డి.సత్యనారాయణ, ఏజీఎం, ఆంధ్రాబ్యాంకు, రాయవరం
Advertisement