fluds
-
వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంకండి
–ఇరిగేషన్ యంత్రాంగానికి సీఈ పిలుపు ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఇరిగేషన్ యంత్రాంగానికి గోదావరి డెల్టా సీఈ వారా వీర్రాజు పిలుపునిచ్చారు. బుధవారం ధవళేశ్వరం సీఈఆర్పీ గెస్ట్‌హౌస్‌లో ఫ్లడ్ మీటింగ్‌ను హెడ్‌వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా వీర్రాజు, ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈ వీర్రాజు మాట్లాడుతూ వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం అంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ బి.రాంబాబు మాట్లాడుతూ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. కాటన్‌బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరికలు జారీచేసినప్పుడు ముంపునకు గురిఅయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలన్నారు. హెడ్‌వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు మాట్లాడుతూ బలహీనంగా ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలను చేపడతామన్నారు. కూళ్ళ, సుందరపల్లి, ప్రాంతాల్లో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టాల్సి వుందన్నారు. జిల్లాలో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఫ్లడ్స్టోర్స్కు సంబంధించి మెటిరీయల్స్‌కు ఇప్పటికే టెండర్స్‌ను ఖరారు చేశామని ఈ నెలాఖరు నాటికి అన్ని ఫ్లడ్స్టోర్స్లోను సామగ్రిని పూర్తిస్థాయిలో ఉంచుతామన్నారు. షట్టర్ల నిర్మాణం జరగాల్సిన ఉన్నచోట్ల తాత్కాలిక రక్షణచర్యలను చేపడతామన్నారు. కార్యక్రమంలో తూర్పు డివిజన్ఈఈ అప్పలనాయుడు, సెంట్రల్ డివిజన్ ఈఈ సుధాకర్, పలువురు డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
ప్రాణాలు తీస్తున్న వరదలు
ములుగు : మండలంలోని ములుగు–అన్నంపల్లి మధ్యలో ఉన్న దస్రుమాటు, సర్వాపురం–జగ్గన్నగూడెం నడుమ ఉన్న బొగ్గుల వాగులు ప్రాణాలను హరించే విధంగా మారాయి. 2006లో కురిసిన వర్షాలతో దస్రుమాటు ఉధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో గోవిందరావుపేట మండలంలోని దుంపెల్లిగూడెంకు చెందిన పోరిక ప్రతాప్– స్వప్న దంపతులు వాగు దాటుతూ ప్రమాదవశాత్తు అందులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం చాలా మంది వాగులో కొట్టుకుపోయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగా, వాగు ప్రవహించిన ప్రతిసారి అన్నంపల్లి, దేవగిరిపట్నం, కాశీందేవిపేట, పత్తిపల్లి, పొట్లాపురం, చింతలపల్లి, రామయ్యపల్లి, కొడిశలకుంట, చింతకుంట గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలు నిలిచిపోతాయి. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు నిత్యం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గత వేసవిలో దస్రూమాటుపై హైలెవల్ కాజ్వే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. లెక్కలు తప్ప.. నిర్మాణం లేదు.. సర్వాపురంలోని బొగ్గుల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని ఐటీడీఏ అధికారులు మూడేళ్లుగా చెబుతున్నారే తప్ప.. ఇప్పటి వరకు పనులు ప్రారంభించడంలేదు. గత ఏడాది పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కాజ్‌వేపై ఇరువైపులా పిల్లర్లు నిర్మించేందుకు ప్రయత్నించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. పనులకు మోక్షం కలుగలేదు. బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహించిన సమయం లో జగ్గన్నగూడెం, అంకన్నగూడెం గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయి. 2012లో జగ్గన్న గూడెంకు చెందిన వల్లపు లక్ష్మి, మంగ పేట మండలానికి చెందిన పుష్పవతి వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. కాగా, వీరిద్దరు అక్కచెల్లెల్లు కావడం గమనార్హం.