ప్రాణాలు తీస్తున్న వరదలు
Published Sat, Jul 30 2016 12:10 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
ములుగు : మండలంలోని ములుగు–అన్నంపల్లి మధ్యలో ఉన్న దస్రుమాటు, సర్వాపురం–జగ్గన్నగూడెం నడుమ ఉన్న బొగ్గుల వాగులు ప్రాణాలను హరించే విధంగా మారాయి. 2006లో కురిసిన వర్షాలతో దస్రుమాటు ఉధృతంగా ప్రవహించింది.
ఈ సమయంలో గోవిందరావుపేట మండలంలోని దుంపెల్లిగూడెంకు చెందిన పోరిక ప్రతాప్– స్వప్న దంపతులు వాగు దాటుతూ ప్రమాదవశాత్తు అందులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం చాలా మంది వాగులో కొట్టుకుపోయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగా, వాగు ప్రవహించిన ప్రతిసారి అన్నంపల్లి, దేవగిరిపట్నం, కాశీందేవిపేట, పత్తిపల్లి, పొట్లాపురం, చింతలపల్లి, రామయ్యపల్లి, కొడిశలకుంట, చింతకుంట గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలు నిలిచిపోతాయి. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు నిత్యం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గత వేసవిలో దస్రూమాటుపై హైలెవల్ కాజ్‌వే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
లెక్కలు తప్ప.. నిర్మాణం లేదు..
సర్వాపురంలోని బొగ్గుల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని ఐటీడీఏ అధికారులు మూడేళ్లుగా చెబుతున్నారే తప్ప.. ఇప్పటి వరకు పనులు ప్రారంభించడంలేదు. గత ఏడాది పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కాజ్‌వేపై ఇరువైపులా పిల్లర్లు నిర్మించేందుకు ప్రయత్నించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. పనులకు మోక్షం కలుగలేదు. బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహించిన సమయం లో జగ్గన్నగూడెం, అంకన్నగూడెం గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయి. 2012లో జగ్గన్న గూడెంకు చెందిన వల్లపు లక్ష్మి, మంగ పేట మండలానికి చెందిన పుష్పవతి వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. కాగా, వీరిద్దరు అక్కచెల్లెల్లు కావడం గమనార్హం.
Advertisement