వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంకండి
–ఇరిగేషన్ యంత్రాంగానికి సీఈ పిలుపు
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఇరిగేషన్ యంత్రాంగానికి గోదావరి డెల్టా సీఈ వారా వీర్రాజు పిలుపునిచ్చారు. బుధవారం ధవళేశ్వరం సీఈఆర్‌పీ గెస్ట్‌హౌస్‌లో ఫ్లడ్ మీటింగ్‌ను హెడ్‌వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా వీర్రాజు, ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ బి.రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈ వీర్రాజు మాట్లాడుతూ వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం అంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ బి.రాంబాబు మాట్లాడుతూ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. కాటన్‌బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరికలు జారీచేసినప్పుడు ముంపునకు గురిఅయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలన్నారు. హెడ్‌వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు మాట్లాడుతూ బలహీనంగా ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలను చేపడతామన్నారు. కూళ్ళ, సుందరపల్లి, ప్రాంతాల్లో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టాల్సి వుందన్నారు. జిల్లాలో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఫ్లడ్‌స్టోర్స్‌కు సంబంధించి మెటిరీయల్స్‌కు ఇప్పటికే టెండర్స్‌ను ఖరారు చేశామని ఈ నెలాఖరు నాటికి అన్ని ఫ్లడ్‌స్టోర్స్‌లోను సామగ్రిని పూర్తిస్థాయిలో ఉంచుతామన్నారు. షట్టర్‌ల నిర్మాణం జరగాల్సిన ఉన్నచోట్ల తాత్కాలిక రక్షణచర్యలను చేపడతామన్నారు. కార్యక్రమంలో తూర్పు డివిజన్‌ఈఈ అప్పలనాయుడు, సెంట్రల్ డివిజన్ ఈఈ సుధాకర్, పలువురు డీఈ, ఏఈలు పాల్గొన్నారు.