ఇక ఎగిరే రైళ్లు వస్తున్నాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : దశాబ్దం క్రితం కలలుగన్న ఎగిరే కార్లు, హైపర్‌లూప్ రైళ్లు త్వరలో సాకారం కానున్న విషయం తెల్సిందే. ఇదే కలల్లోకి మరో కొత్త కల వచ్చి చేరింది. అదే ఎగిరే రైళ్లు. ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అక్కా టెక్నాలజీస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందులో గుండ్రని రైలు ఆకారంలో ప్రయాణికులు కూర్చునే ఓ ట్యూబ్ ఉంటుంది. దాన్ని ఓ చక్రాల వాహనం రన్‌వేలో గద్దలా ఆగిన విమానం కిందకు తీసుకొస్తుంది. ఆ విమానానికి రెక్కలు తప్ప బాడీ ఉండదు. చక్రాల బండి మీద తీసుకొచ్చిన రైలును విమానానికి అటాచ్ చేస్తారు. అది దాన్ని మోసుకొని గమ్యస్థానానికి బయల్దేరి వెళుతుంది.
ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్‌ను కంపెనీ త్రీడీ వీడియోగా రూపొందించింది. ఈ కొత్త ప్రాజెక్టులో పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రసిద్ధ చెందిన కంపెనీలను ఆహ్వానించగా ఇప్పటికే పలు కంపెనీలు ఉత్సాహం చూపించినట్లు కంపెనీ సీఈవో మారిస్ రిక్కీ తెలిపారు. 170 కోట్ల డాలర్ల విలువ కలిగిన అక్కా టెక్నాలజీస్‌తో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు వివిధ ప్రాజెక్టుల్లో కలిసి పోతున్నాయి. ఈ ఎగిరే రైళ్లు ప్రాజెక్ట్ పూర్తయితే రైల్వే వ్యవస్థలోనే పిప్లవాత్మక మార్పులు వస్తాయని, వివిధ ప్రాంతాలకు వెళ్లే ట్యూబ్ లాంటి రైళ్లు రైల్వే స్టేషన్ల వద్ద ఉంటాయని, వాటిని ఎగిరే విమానాలు వచ్చి తీసుకెళతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. తద్వారా, రైల్వేలకు ఓ వైమానిక వ్యవస్థ ఏర్పడుతుందని, ప్రయాణికుడు తన ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లో దిగే సౌకర్యం వస్తుందని ఆ వర్గాలు వివరించాయి.