వంట నూనె విక్రయాలపై కేసులు
అనంతపురం అర్బన్ : నాణ్యత లేని వంట నూనె విక్రయాలపై కేసులు నమోదు చేసినట్లు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ సమావేశంలో మాట్లాడుతూ ఆహార పరిరక్షణ అధికారులు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 14 ఆహార నమూనాలను పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపించారన్నారు. గతంలో వచ్చిన నివేదికల మేరకు శబరి పామెలిన్ (అనంతపురం), జీఎన్ఎస్ గోల్డ్ పామోలిన్ (అనంతపురం) నమూనాలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షలు విధించామన్నారు.
మరో మూడు నమూనాలు సురక్షితం కాదని తేలడంతో కదిరి, హిందూపురం కోర్టుల్లో కేసు నమోదు చేశామన్నారు. విచారణ ముగిసన తర్వాత జరిమానా, శిక్ష ఉంటుందన్నారు. ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించి 68 తనిఖీలు చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 18 దుకాణాలపై కేసులు నమోదు చేశారని, 12 దుకాణాల లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేశారని తెలిపారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి 55 కేసులు నమోదు చేశారని, రూ.7.75 లక్షలు అపరాధ రుసుం విధించారని చెప్పారు.