చేపల కూర తిప్పలు.. 350మందికి డేంజర్
జయపురం(ఒడిశా): ఒక వివాహ విందు భోజనం విషాదాన్ని తెచ్చిపెట్టింది. భోజనానికి వెళ్లిన దాదాపు 350 మంది అస్వస్థతకు లోనయ్యారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర సమితి ఝొడఝొంగ గ్రామంలో చోటుచేసుకుంది. తురుడిహి పంచాయతీ ఝొడడఝొంగి గ్రామానికి చెందిన బిరెన్ కమారుడి పెళ్లి సందర్భంగా సోమవారం రాత్రి తన బంధుమిత్రులకు చేపల విందుభోజనం పెట్టారు.
పలు గ్రామాల నుంచి వందలాది మంది వచ్చి విందు ఆరగించారు. భోజనాల తరువాత తిరిగి వెళ్లేందుకు బయల్దేరుతున్న వారికి అకస్మాత్తుగా వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. విందు భోజనాల దగ్గర ఉన్న వారికి కూడా ఇదే అనుభవం ఎదురవటంతో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. రాత్రి పొద్దుపోయాక కూడా పరిస్థితి మెరుగుకాక పోవటంతో స్థానికులు బాధితులను ఆస్పత్రులకు తరలించారు. గురుడిహి, పవురబెల, ఝొడఝంగ గ్రామాలకు చెందిన దాదాపు 350 మంది అనారోగ్యం పాలైనట్లు సమాచారం. వారిలో విషమంగా ఉన్న వారిని ఝెడఝంగ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా చికిత్స పొందుతున్నారు.