on foot
-
‘శ్రీవారి’ కోసం.. వేల కిలోమీటర్లు కాలినడకన..
తాడిపత్రి: ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలనే సంకల్పం ఆ వృద్ధ దంపతులను వేలాది కిలోమీటర్ల దూరం నడిపించింది. స్వామివారి దర్శనభాగ్యం లభించిన అనంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి తిరుగు పయనమయ్యారు. తాడిపత్రి ప్రాంతానికి చేరుకున్న ఆ వృద్ధ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాకు చెందిన డాక్టర్ ఆర్.ఉపాధ్యాయ(74), భార్య సరోజినీ (71).. డాక్టరేట్ పూర్తి చేశారు. ఉపాధ్యాయ తల్లి మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసేవారు. ఆమె కొన్నేళ్ల క్రితం కేన్సర్‌తో చనిపోయారు. ఆమెకు జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలనే కోరిక ఉండేది. కేన్సర్ కారణంగా శరీరం సహకరించక పోవడంతో ఆమె కోరిక నెరవేరలేదు. కానీ అత్త బాధను అర్థం చేసుకున్న కోడలు సరోజినీ తన భర్త ఉపాధ్యాయతో కలసి కాలినడకన వెళ్లి ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దాదాపు 70 రోజుల క్రితం సుమారు 2,150 కిలోమీటర్ల దూరంలోని తిరుమలకు తోపుడు బండి (లగేజీ కోసం) తీసుకుని కాలినడకన బయలు దేరారు. స్వామి సన్నిధికి చేరుకునేందుకు 59 రోజులు పట్టింది. వెంకన్న దర్శనానంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి పయనమయ్యారు. కాగా, ఏడు కొండల వాడి దర్శనానికి బయలుదేరే ముందు తన భార్యకు కాళ్లవాపుతో పాటు ఆయాసం ఉండేదని, తనకూ గ్లకోమా వ్యాధి ఉండేదని ఉపాధ్యాయ చెప్పారు. స్వామిపైన భారం వేసి యాత్ర మొదలుపెట్టామని, ఇప్పుడంతా బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. తన భార్య నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని కొంతదూరం తోసుకుంటూ వెళ్తున్నట్లు ఉపాధ్యాయ చెప్పారు. వారి సంకల్పాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోతున్నారు. -
బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు వెళ్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే(ఎన్ఏఎస్)–2021లో తేలింది. 18 శాతం మంది సైకిళ్లపై పాఠశాలలకు చేరుకుంటున్నట్లు వెల్లడయ్యింది. స్కూల్ ట్రాన్స్‌పోర్టు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించకుంటున్నవారు కేవలం 9 శాతం మంది ఉన్నారు. 8 శాతం మంది సొంత వాహనం(టూ వీలర్)పై, 3 శాతం మంది సొంత కార్లలో స్కూలుకు వెళ్తున్నారు. పిల్లల విద్యాభ్యాసం విషయంలో కనీసం 25 శాతం స్కూళ్లకు విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు లేదని సర్వేలో గుర్తించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 720 జిల్లాల్లో 1.18 లక్షల స్కూళ్లకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వే పాల్గొన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 12న 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులను ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో సర్వే చేపట్టారు. చివరిసారిగా 2017లో ఎన్ఏఎస్ సర్వే జరిగింది. -
కదంతొక్కిన ఒడిశా కార్మికులు
* ఇటుకబట్టీల యజమానులు దాడిచేశారని ఆరోపణ * 42 కిలోమీటర్లు కాలినడకన కరీంనగర్‌కు సుల్తానాబాద్: ఇటుకబట్టీల యజమానులు తమపై దాడి చేశారని, అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ నుంచి ఒడిశా కార్మికులు కదం తొక్కారు. తమకు కలెక్టర్, లేబర్ ఆఫీసరే న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లాకేం ద్రంలోని అధికారి కార్యాలయానికి గురువారం రాత్రి కాలి నడకన బయలుదేరారు. వారిని నిలువరించేందుకు బట్టీల యజమానులు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. దారి మధ్యలో సుల్తానాబాద్‌లో పోలీసులు ఆపేందుకు విఫలయత్నం చేశారు. చేసేదేమీ లేక పోలీసులు వారి వెంటే తరలివెళ్లారు. బట్టీల నుంచి జిల్లా కేంద్రానికి సుమారు 42 కిలోమీటర్ల దూరం ఉండగా.. దారి వెంట ఉండే పోలీస్స్టేషన్ల నుంచి రహదారిపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులకు మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు సైతం తరలివెళ్లారు. కార్మికులకు రక్షణగా పెద్దపల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసరావు, మహేశ్, పెద్దపల్లి, సుల్తానాబాద్ ఎస్సైలు రాజ్‌కుమార్, విజేందర్, ఇంద్రసేనారెడ్డి, పోలీసులు ఉన్నారు. రెండు నెలల క్రితం ఓ ఇటుక బట్టీలో ఒడిశాకు చెందిన గర్భిణీపై సూపర్వైజర్ దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన మరిచిపోకముందే గురువారం కార్మికులు ర్యాలీగా పయనమవడం తో ఇటుకబట్టీల యజమానుల్లో వణుకు మొదలైంది. -
రాజమండ్రిలో స్నానానికి కాలినడకే!
ఘాట్ల సమీపానికి వాహనాలపై ఆంక్షలు 600 మీటర్ల దూరంలోనే నిలిపివేత భక్తుల కోసం 300 ఉచిత బస్సులు సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేయాలనుకునే వారికి అర కిలోమీటర్ నడక తప్పక పోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కొంతదూరం నడిస్తేగానీ పుష్కర ఘాట్లకు చేరుకోలేరు. రాజమండ్రిలో పుష్కర ఘాట్ల వద్దకు ఎలాంటి వాహనాలను అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఘాట్లకు 600 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తారు. రద్దీనిబట్టి దూరాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాలి నడక ద్వారానే భక్తులు ఘాట్ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. నడవడానికి వీల్లేని స్థితిలో ఉన్న వృద్ధుల కోసం చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంచుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 262 పుష్కర ఘాట్లను నిర్మించారు. రాజమండ్రి పరిసరాల్లో 16 ఘాట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది పుష్కర స్నానమాచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 12 లక్షల మంది రాజమండ్రికే వస్తారని సమాచారం. ఘాట్ల వరకు ఉచిత బస్సులు వివిధ మార్గాల్లో రాజమండ్రికి చేరుకున్న భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు రావాలంటే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉచిత బస్సులు ఎక్కాల్సిందే. ప్రైవేట్ వాహనాలను పార్కింగ్ ప్రాంతాల వరకే అనుమతిస్తారు. పార్కింగ్ కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ నుంచి పుష్కర ఘాట్లకు 300 ఉచిత బస్సులు నిరంతరాయంగా తిరుగుతాయి. పుష్కర ఘాట్ల వద్ద వాహనాల రాకపోకల నిషేధిత ప్రాంతంలోకి ఉచిత బస్సులను సైతం అనుమతించరు. కొంత దూరంలోనే నిలిపేస్తారు. చిన్న ఘాట్లలో నీటి ఇబ్బందులు రాష్ట్రంలో 262 పుష్కర ఘాట్లు ఉండగా.. 130 ఘాట్లను ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా నిర్మించింది. గోదావరి పక్కనే ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తుల రద్దీ తక్కువగానే ఉండనుంది. అయినా అలాంటి ఘాట్లలో పుష్కర స్నానాలకు సరిపడా నీటిమట్టం ఉంటుందో లేదోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధవళే శ్వరం బ్యారేజీకి ఎగువన ఉన్న ఘాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, బ్యారేజీకి దిగువన ఉండే ఘాట్లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఆయా ఘాట్ల వద్ద నీటి నిల్వకు అవకాశం లేదు. పుష్కర ఘాట్లలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడితే షవర్ సిస్టమ్ ద్వారా భక్తులు స్నానాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.