రాజమండ్రిలో స్నానానికి కాలినడకే!
- ఘాట్ల సమీపానికి వాహనాలపై ఆంక్షలు
- 600 మీటర్ల దూరంలోనే నిలిపివేత
- భక్తుల కోసం 300 ఉచిత బస్సులు
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేయాలనుకునే వారికి అర కిలోమీటర్ నడక తప్పక పోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కొంతదూరం నడిస్తేగానీ పుష్కర ఘాట్లకు చేరుకోలేరు. రాజమండ్రిలో పుష్కర ఘాట్ల వద్దకు ఎలాంటి వాహనాలను అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఘాట్లకు 600 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తారు.
రద్దీనిబట్టి దూరాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాలి నడక ద్వారానే భక్తులు ఘాట్ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. నడవడానికి వీల్లేని స్థితిలో ఉన్న వృద్ధుల కోసం చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంచుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 262 పుష్కర ఘాట్లను నిర్మించారు. రాజమండ్రి పరిసరాల్లో 16 ఘాట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది పుష్కర స్నానమాచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 12 లక్షల మంది రాజమండ్రికే వస్తారని సమాచారం.
ఘాట్ల వరకు ఉచిత బస్సులు
వివిధ మార్గాల్లో రాజమండ్రికి చేరుకున్న భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు రావాలంటే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉచిత బస్సులు ఎక్కాల్సిందే. ప్రైవేట్ వాహనాలను పార్కింగ్ ప్రాంతాల వరకే అనుమతిస్తారు. పార్కింగ్ కేంద్రాలతో పాటు బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ నుంచి పుష్కర ఘాట్లకు 300 ఉచిత బస్సులు నిరంతరాయంగా తిరుగుతాయి. పుష్కర ఘాట్ల వద్ద వాహనాల రాకపోకల నిషేధిత ప్రాంతంలోకి ఉచిత బస్సులను సైతం అనుమతించరు. కొంత దూరంలోనే నిలిపేస్తారు.
చిన్న ఘాట్లలో నీటి ఇబ్బందులు
రాష్ట్రంలో 262 పుష్కర ఘాట్లు ఉండగా.. 130 ఘాట్లను ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా నిర్మించింది. గోదావరి పక్కనే ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తుల రద్దీ తక్కువగానే ఉండనుంది. అయినా అలాంటి ఘాట్లలో పుష్కర స్నానాలకు సరిపడా నీటిమట్టం ఉంటుందో లేదోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ధవళే శ్వరం బ్యారేజీకి ఎగువన ఉన్న ఘాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, బ్యారేజీకి దిగువన ఉండే ఘాట్లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఆయా ఘాట్ల వద్ద నీటి నిల్వకు అవకాశం లేదు. పుష్కర ఘాట్లలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడితే షవర్ సిస్టమ్ ద్వారా భక్తులు స్నానాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.