నా ఆరోగ్యం బాగానే ఉంది: పీలే
సావో పాలో: తన అనారోగ్యం గురించి వస్తున్న కథనాలను ఫుట్బాల్ దిగ్గజం పీలే ఖండించారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళనపడాల్సిన విషయమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 74 ఏళ్ల ఈ బ్రెజిల్ దిగ్గజం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు, ఇంటెన్సివ్ కేర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ‘నా ఆరోగ్య పరిస్థితి గురించి ఈ వేదికను ఉపయోగించుకుని అందరికీ చెప్పదలుచుకున్నాను. నేను బాగానే ఉన్నాను.
ఈ రోజు (శుక్రవారం) నన్ను ఐసీయూలో ఉంచలేదు. ఏకాంతంగా ఉండేందుకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిలో ఉంచారు. మీ అందరి ప్రేమ, అభిమానంతో కోలుకున్నాను. ప్రస్తుతానికి ఆందోళనపడాల్సిన స్థితి లేదు. కొత్త ఏడాది సరికొత్త ఆరోగ్యంతో గడపాలనుకుంటున్నాను. అలాగే విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నాను’ అని పీలే ట్విట్టర్లో పేర్కొన్నారు.
మూత్ర పిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు ఈనెల 13న సర్జరీ చేయించుకున్న పీలే... సోమవారం ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా మరోసారి అడ్మిట్ అయ్యారు. పీలే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఆయనకు హెమోడయాలసిస్ జరుపుతున్నట్టు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆస్పత్రి పేర్కొంది. కృత్రిమ కిడ్నీ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి పీలే శరీరంలోకి పంపుతున్నారు.