‘గోల్’ కనిపిస్తుంది...
బంతి ఆకారాన్ని ఊహించుకోవడం తప్ప.. ఎలా ఉంటుందో తెలియదు. మైదానాన్ని చూడలేరు.. గోల్ పోస్ట్‌లు ఎక్కడున్నాయో గుర్తించలేరు. కానీ, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. అంధులే అయినా.. బంతి గమనాన్ని పసిగడుతున్నారు. అద్భుత రీతిలో గోల్స్ నమోదు చేస్తున్నారు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఫుట్బాల్నూ అలవోకగా ఆడేస్తూ.. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వారి కోసమే ప్రత్యేకంగా రూపొందిన ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్‌షిప్, పారాఒలింపిక్స్ స్థాయిలో అదరగొడుతున్నారు అంధ ఫుట్‌బాల్ వీరులు.
బ్లైండ్ ఫుట్‌బాల్‌కు దాదాపుగా 35 ఏళ్ల చరిత్ర ఉంది. 1980లో దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో చూపులేనివాళ్లు ఈ తరహా ఫుట్‌బాల్ ఆడేవారు. అయితే బ్లైండ్ ఫుట్‌బాల్ 5-ఎ-సైడ్ ఫుట్‌బాల్‌గా స్పెయిన్‌లో మెరుగులు దిద్దుకుంది. 1986లో స్పానిష్ జాతీయ 5-ఎ-సైడ్ ఫుట్‌బాల్ టోర్నీని నిర్వహించారు. 1998 నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మెగా టోర్నీలో బ్రెజిల్ మూడుసార్లు విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్లైండ్ ఫుట్‌బాల్ పారా ఒలింపిక్స్‌లో క్రీడాంశంగా ఉంది. 2004లో ఇది పారా ఒలింపిక్స్‌లో భాగమైంది. బ్లైండ్ సాకర్‌లో మెగా టోర్నీగా భావించే పారా ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా మూడుసార్లు బ్రెజిలే చాంపియన్‌గా నిలిచింది. ఈ ఫుట్‌బాల్‌లో యూరోప్, అమెరికా ఖండాలకు చెందిన జట్లు తరుచుగా తలపడతాయి. ఆసియా దేశాలకు చెందిన కొన్ని జట్లు కూడా తమ సత్తా చాటుతున్నాయి.
సాకర్ ఆడేదిలా..
చూపులేని వాళ్లు ఫుట్‌బాల్ ఆడటమంటే మాటలు కాదు.. అందుకే ఫిఫా నిబంధనల్ని సవరించి, ఆట స్వరూపాన్ని మార్చేసి 5-ఎ-సైడ్ బ్లైండ్ ఫుట్‌బాల్‌గా నామకరణం చేశారు. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో 5-ఎ-సైడ్ బ్లైండ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక మ్యాచ్‌లో బరిలోకి దిగే ప్రతీ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఉంటారు. గోల్‌కీపర్ కూడా వీరిలో ఒకడు. మ్యాచ్‌ల్లో చూపున్న గోల్కీపర్ను బరిలోకి దించవచ్చు. ఇక వీళ్లు ఎలా ముందుకు వెళ్లాలో చెప్పేందుకు ఓ గైడ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే అతను మైదానం బయట ఉండేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఫుట్‌బాల్‌లో బంతి పరిమాణాన్ని తగ్గించి.. అది ఎటువెళుతోందో ఆటగాళ్లకు వినపడేందుకు కొన్ని చప్పుడు గుళికలను బంతిలో ఉంచుతారు. ఇక ఆట 50 నిమిషాల పాటు కొనసాగుతుంది.