అభివృద్ధిలో నేదురుమల్లి ముద్ర
జ్ఞాపకాలు
సాక్షి, రాజమండ్రి: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శుక్రవారం మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని ఈ ప్రాంతంతో ఆయనకు గల అనుబంధాన్ని జిల్లావాసులు నెమరు వేసుకున్నారు. ఆయన హయాంలో జిల్లా అభివృద్ధిలో కీలకమనదగ్గ పనులు ప్రారంభించారు. రాజమండ్రిలో 1991లో గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తండ్రి చిర్ల సోమసుందరరెడ్డితో జనార్దనరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. పుష్కరాలకు వచ్చిన సందర్భంగా ఆయన గోపాలపురం వెళ్లి సోమసుందరరెడ్డిని కలుసుకున్నారు. ఇదే ఏడాది ఏలేశ్వరంలో ఏలేరు ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1992 జూన్ 26న పి.గన్నవరంలోని కొత్త ఆక్విడెక్టుకు శంకుస్థాపన చేశారు.
నక్సలైట్ల అణచివేత
1990 డిసెంబర్ 17న ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నేదురుమల్లి అధికారంలో ఉన్న కాలంలో నక్సలైట్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. 1991 సంవత్సరంలో ఏఓబీలో సుమారు 250 మంది పౌరులు, 75 మంది పోలీసు జవానులు, 102 మంది నక్సలైట్లు మరణించారు. ఈ కాలంలో వీరిపై ఉక్కుపాదం మోపి రైతు కూలీ సంఘాలను అణచివేశారు. లొంగుబాట్లకు వెసులుబాటు కల్పించారు. 1992లో సుమారు 9,000 మంది పోలీసులకు లొంగిపోయారు. వీరిలో నక్సలైట్ క్యాడర్‌తో పాటు, మిలిటెంట్లు, సానుభూతిపరులు ఉన్నారు. అప్పటి నుంచి బలం, బలగం తగ్గడంతో ఉద్యమం కూడా బలహీనపడుతూ వచ్చింది.