'మేం మా బిడ్డలకు గోరు ముద్దలు పెట్టొద్దా'
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇంకా భూముల ఆక్రమణ దాహం తీరనట్లుందని రైతు కూలి సంఘం నేత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ధర్నాలో ఆయన మాట్లాడుతూ తమ భూములు లాక్కోవద్దని మూకుమ్మడిగా చెప్తున్నా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు.
ఇదే మట్టిలో నుంచి పండించిన పంటలు చంద్రబాబు తల్లి ఆయనకు గోరు ముద్దలు తినిపించిందని, అలాంటి నేలలో పంటలు పండించుకొని తమ బిడ్డలకు మేం గోరు ముద్దలు పెట్టుకోవద్దా అని నిలదీశారు. అసలు అక్రమంగా ఎన్ని భూములు తీసుకుంటారని ప్రశ్నించారు. తమలాంటి పేద రైతుల కష్టాలను గుర్తించి అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చారని, ఆయనకు తాము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.