అసెంబ్లీకి అంబేద్కర్‌పేరు పెట్టాలి
ఆనందపేట: నవ్యాంధ్రలో అసెంబ్లీ భవనానికి అంబేద్కర్‌పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు. గుంటూరు లక్ష్మీపురంలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాజధాని భవన సముదాయానికి ఎన్టీఆర్ ప్రాంగణంగా నామకరణం చేయాలని, అసెంబ్లీకి అంబేద్కర్‌పేరు పెట్టాలని, అసెంబ్లీ ఎందుట జాతిపిత మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.
అదే విధంగా తుళ్లూరు కరకట్టనుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసినట్టు విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మొదట ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలన్నారు. జ్ఞానబుద్ధను ఐకాన్‌గా చేస్తే ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ప్రదేశ్ అనేది ఉత్తరానికి చెందిన పేరనీ, కాబట్టి ఆంధ్ర ప్రదేశ్‌ను తెలుగునాడు అని పేరు పెట్టాలన్నారు. చెన్నై, లండన్ మ్యూజియంలలో ఉన్న అమరావతి శిల్ప సంపదను తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కాగా ఏప్రిల్ 14న తన రాజకీయ భవిష్యత్‌ను వెల్లడిస్తాననీ, సహచరులు, కార్యకర్తల సలహాలు, సూచనల మేరకు తన నిర్ణయం ఉంటుందని వివరించారు.
టీడీపీలోకి డొక్కా...
డొక్కా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన బాటలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.