నేతాజీ వివాదం ముగియకముందే..
న్యూఢిల్లీ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం.. మరణం.. లాంటి విషయాలకు సంబంధించి పశ్చిమబెంగాల్ విడుదల చేసిన డాక్యుమెంట్లపై వివాదాలు, భిన్నాభిప్రాయాలు సమసిపోకముందే మరో అంశం తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. తన తండ్రి, మాజీ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి మృతికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్.. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని, దానిపై ప్రభుత్వం స్పందిస్తే నిజనిజాలు బయటపడతాయన్నారు. సుమారు 50 ఏళ్ల కిందట తాష్కెంట్(జనవరి 11, 1966) లో జరిగిన శాస్త్రి మృతి ఘటనపై ఇప్పటికీ సందేహాలు అలాగే ఉండిపోయాయని అనిల్ ప్రస్తావించారు. శాస్త్రి మృతికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలంటూ గతంలో బీజేపీ డిమాండ్ చేసిందన్న విషయాన్ని గుర్తుచేశారు.
స్వదేశానికి తీసుకువచ్చిన తండ్రి మృతదేహంపై ఉన్న కొన్ని గుర్తులు, మరకలు ఆయన మృతిపై పెను అనుమానాలకు దారితీసిందని చెప్పారు. మాజీ ప్రధాని మరో కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి మాట్లాడుతూ.. గతంలో చాలా మంది ప్రధానులను ఈ విషయాలకు సంబంధించిన ఫైళ్లను అందించాలని కోరినట్లు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ మృతిపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొన్ని కీలక డాక్యుమెంట్లను విడుదల చేసిన వారం రోజుల్లోనే మరో వివాదాస్పాద అంశం తెరమీదకు వచ్చింది. విదేశీ పర్యటన నుంచి తిరిగిరాగానే తన తండ్రి గురించిన సమాచారం కోసం ప్రధానికి లేఖ రాయనున్నట్లు అనిల్ శాస్త్రి వెల్లడించారు.