పోరు.. నీరు
అన్నదాతల పోరు ఫలించింది. ఇక్కడ పంటలు ఎండుతుంటే హక్కులు లేని ప్రాంతానికి నీటి తరలింపా...అని ముక్తకంఠంతో ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు నినదించడంతో అధికారులు దిగివచ్చారు. ప్రభుత్వంలో కదలిక వచ్చింది. చివరికి శుక్రవారం రాత్రి ప్రాజెక్టుకు తొలివిడతగా రెండువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పంటలు పూర్తిగా చేతికి వచ్చేవరకూ జలాలను అందిస్తామని వెల్లడించారు. దీనింతో సుమారు 40 వేల ఎకరాల భూముల్లోని పంటలకు జీవం వచ్చినట్లైంది.
గద్వాల, న్యూస్‌లైన్ : ఆర్డీఎస్ రైతుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి శుక్రవారం రాత్రి మూడు వేల క్యూసెక్కుల నీటిని ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకోసం విడుదల చేయించింది. దీంతో ఈ పరిధిలో వారం రోజులుగా నీళ్లులేక వాడిపోతున్న పంటలకు నీళ్లందే అవకాశం ఏర్పడింది. ఈనెల 21వ తేదీ నుంచి ఆర్డీఎస్ కాల్వ ద్వారా పంటలకు నీటి విడుదల ఆగిపోయిన సంగతి విదితమే. ఆయకట్టులో పంటలు పూర్తి కాకుండానే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీటి విడుదల నిలిచిపోవడంతో, ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటి మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఆయకట్టు రైతు ప్రతినిధులు ప్రభుత్వానికి సమస్యలను తెలిపారు.
హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, జిల్లా మంత్రి అరుణను, ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. ఇదే సమయంలో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ ఓవర్‌ఫ్లో నీళ్లు చేరాల్సిన కర్నూలు, కడప సుంకేసుల బ్యారేజీ పరిధిలోని కర్నూలు జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కర్నూలులో నిర్వహించారు. ఇలా రెండు జిల్లాల నుంచి తుంగభద్ర రిజర్వాయర్ నీటి విడుదల కోసం ఆందోళనలు జరగడంతో, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆర్డీఎస్, కేసీ కాల్వలకు రావాల్సిన జాయింట్ ఇండెంట్ నీటిని అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీకి మళ్లించడంపై నిరసన వ్యక్తమైంది. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు అనుమతించింది.
ఈ మేరకు శుక్రవారం రాత్రి కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాలుగు రోజుల వరకు మూడువేల క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించి అనంతరం రెండు వేల క్యూసెక్కులకు కుదిస్తారు. జనవరి 10వరకు మొదటి విడత నీటి విడుదలను కొనసాగించి పది రోజుల పాటు నీటి విడుదలను నిలిపేస్తారు. జనవరి 20 నుంచి రెండో దశలో నీటి విడుదల తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది. ఇలా ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో ఉన్న 30వేల ఎకరాల్లోని పంట పూర్తయ్యే వరకు నీటి విడుదల కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
పంటలు పూర్తయ్యే వరకు ఇస్తాం - జూరాల ఎస్ఈ ఖగేందర్.
ఆర్డీఎస్ పరిధిలోని 30వేల ఎకరాల్లో ఉన్న పంటలు పూర్తయ్యే వరకు విడతల వారీగా తడువు పెట్టేలా నీటి విడుదల కొనసాగిస్తామని జూరాల ఎస్ఈ ఖగేందర్ ‘న్యూస్‌లైన్’ కు తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచే మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ఆయకట్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న పంటలు పూర్తయ్యే వరకు తడులు పెట్టుకునేలా నీటి విడుదల కొనసాగింపు ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్డీఎస్ పరిధిలోని రైతులు కాల్వకు వస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవడంతోపాటు, దిగువ రైతులకు నీళ్లందేలా సహకరించాలని ఎస్ఈ కోరారు.