ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది..
ముంబై: టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత జీఈసీ సభ్యుడు ప్రొఫెసర్ నిర్మల్య కుమార్ (56) తొలిసారిగా స్పందించారు. టాటా సన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదవీచ్యుతుడైన ఆయన తన మనోభావాలను "ఐ జస్ట్ గాట్ ఫైర్డ్ " అనే పేరుతో వ్యక్తిగత వెబ్సైట్ (బ్లాగ్) లో పోస్ట్ చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కుమార్ ముందస్తు సమాచారం ఏమీ లేకుండానే అంతా ఒక నిమిషంలో ముగిసిందని వాపోయారు. కేవలం తాను మిస్త్రీకి సన్నిహితుడిననే కారణంగానే ఈ పరిణామం సంభవించిందని పేర్కొన్నారు. ఎంతపెద్ద సంస్థకు వెళితే మానవ విలువలు అంతగా క్షీణిస్తాయంటూ ఫిలాసఫీ చెప్పుకొచ్చారు.
అక్టోబర్ 31 తన జీవితంలో ఒక వింతైన రోజని తన పోస్ట్ లో కుమార్ పేర్కొన్నారు. తనకు ఎంతో సన్నిహితుడు, తరచూ తన వాదనలు బలపరిచే వ్యక్తినుంచి ఇక రేపటి నుంచి విధులకు రావాల్సిన అవసరం లేదనే సమాచారం అందుకోవడం విచారకరమన్నారు. అంతే. ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది. "ఐ జస్ట్ గాట్ ఫైర్డ్ " అంటూ తనపై వేటు పడిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.
కంపెనీనుంచి ఒకసారి తొలగించిన తరువాత మన నిజమైన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుందన్న కుమార్ కానీ తనను గౌరవించిన, ఆప్యాయంగా ఆదరించిన వారిని వీడడం విచారకరమని, వారి హృదయపూర్వక చిరునవ్వులు ఎల్లపుడూ తనతో ఉంటాయన్నారు. ముగ్గురు తప్ప తనతో మూడేళ్లపాటు కలిసి పనిచేసిన సీఈవోలు, ఇతర ఉన్నత అధికారులు మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
అంతేకాదు కార్పొరేట్ ప్రపంచంలో ఇదంతా మామూలేనని,కానీ ఎవరూ ఇలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండరన్నారు. అలాగే 18 సం.రాల వయసు వచ్చిన తరువాత మొదిటిసారి తాను ప్రస్తుతం నిరుద్యోగిగా నిలబడ్డానన్నారు. ఇది టాటాల అమర్యాదకరమైన చర్య తప్ప సంస్థలో 670,000 మంది ఉద్యోగుల తప్పేమీ లేదన్నారు. కేవలం సైరస్ మిస్త్రీతో సన్నిహితం, విస్తృతంగా మెలగడమే దీనికి కారణమన్నారు.