బహుముఖ సహకారంతోనే దేశాభివృద్ధి
భారత మాజీ రాయబారి శ్రీనివాసన్
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): దేశాల మధ్య పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భారత మాజీ రాయబారి టీపీ శ్రీనివాసన్ పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీయూలోని సీప్‌స్టడీస్ విభాగంలో సోమవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో చిన్న, మధ్య తరగతి దేశాలు తమ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక అసవరాల కోసం బహుముఖ సహకారం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. భారతదేశం ఇంకా పలుదేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. ఈ సంబంధాలు ఇంకా మెరుగుపడాల్సి వుందన్నారు. ఎస్వీయూ రెక్టార్ ఎం.భాస్కర్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో సమాచార, సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సంబంధాలు బలపడటానికి దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ పసిఫిక్ స్టడీస్ ప్రచురించిన పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించారు.
శ్రీనివాసన్‌కు జీవితసాఫల్య పురస్కారం
భారత రాయబారిగా శ్రీనివాసన్ చేసిన సేవలకు గుర్తింపుగా సీప్ స్టడీస్ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. ఈకార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ ఎఫైర్స్ డెప్యూటీ డెరైక్టర్ అజనీష్కుమార్, వియత్నాంకు చెందిన ప్రొఫెసర్ సువాన్ బింగ్, సీప్‌స్టడీస్ డెరైక్టర్ జి.జయచంద్రారెడ్డి, మాజీ డెరైక్టర్లు రాజారెడ్డి, లక్ష్మణశెట్టి, యాగమరెడ్డి, రవీంద్రనాధరెడ్డి, అధ్యాపకులు ప్రయాగ, విజయకుమార్, రమేష్‌బాబు పాల్గొన్నారు.