ఘనంగా వీడ్కోలు
తెయూ(డిచ్పల్లి) : సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ వీసీ పార్థసారథి, మాజీ రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రిలకు తెలంగాణ యూనివర్సిటీలో గురువారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్వేగాన్ని తట్టుకోలేని మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్లు కంట తడిపెట్టారు. వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన అనేక మంది అధ్యాపకులు కూడా కన్నీరు పెట్టారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ ప్రొఫెసర్ సి.సాంబయ్య మాట్లాడుతూ.. పార్థసారథి, ప్రొఫెసర్ లింబాద్రిలు న్యాయబద్ధంగా పనిచేసి అపారమైన అభిమానాన్ని సంపాదించారన్నారు. వారి హయాంలో యూనివర్సిటీకి నాక్ ‘బి’ గ్రేడ్ వచ్చిందని, తాను అందరి సహకారంతో ‘ఏ’ గ్రేడ్ తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం మాజీ వీసీ పార్థసారథి మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీతో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని అన్నారు. యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయినా, జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని పేర్కొన్నారు. మనం పదవిలో ఉన్నప్పుడు మనకు వచ్చేది గౌరవం కాదని, సీటు వదిలిన తర్వాత మనం నిజంగా గౌరవం పొందుతామా లేదా అన్నది గమనించాలన్నారు. తన సక్సెస్‌లో ప్రతి ఉద్యోగి కృషి ఉందని, ప్రొఫెసర్ లింబాద్రి తాను వేరు కాదని, క్రెడిట్ అంతా టీం వర్క్‌దే అన్నారు.
ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ.. పార్థసారథి తనకు దేవుడు ఇచ్చిన అన్న అని, ఆయనకు పాదాభివందనం చేయాలని ఉందన్నారు. తనకు అంత గొప్ప వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అందరి సమష్టి కృషితోనే నాక్ గ్రేడ్ సాధించడం సాధ్యమైందని, అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తన జీవితంలో తెలంగాణ యూనివర్సిటీకి అత్యంత ప్రాధాన్యత ఉందని, మీరంతా నా కుటుంబ సభ్యులేనని, మిమ్మల్ని విడిచి వెళుతున్నందుకు బాధగా ఉందని ఉద్వేగ భరితంగా మాట్లాడారు. ప్రిన్సిపాల్, ఆర్ట్స్ డీన్ కనకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రిన్సిపాళ్లు ఎల్లోసా, సత్యనారాయణచారి, సమత, లలిత, డీన్లు యాదగిరి, వైస్ ప్రిన్సిపాళ్లు జాన్సన్, సంపత్‌కుమార్, ప్రవీణాబాయి, శివకుమార్, అంజయ్య తదితరులు ప్రసంగించారు. టూటా తరఫున అధ్యక్షుడు ప్రవీణ్, ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా నియమితులైన ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు, త్రివేణి, బాల శ్రీనివాసమూర్తి, ఘంటా చంద్రశేఖర్, పున్నయ్య, రాంబాబు, చంద్రశేఖర్ తో పాటు అకడమిక్ కన్సల్టెంట్లు, విద్యార్థి సంఘాల నాయకులు వీసీ, రిజిస్ట్రార్ల సేవలను కొనియాడారు.
గజమాలలతో సన్మానం
మాజీ వీసీ పార్థసారథి, మాజీ రిజిస్ట్రార్ లింబాద్రిలను ఈ సందర్భంగా గజమాలలతో సత్కరించారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి, మెమోంటోలతో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులు సన్మానించారు.