‘వర్దా’గ్రహం తప్పింది
తీరం వెంబడి ఎగసిపడిన అలలు
కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసం
రోడ్డును మూసివేసిన అధికారులు
గల్లంతైన మత్స్యకారుడు సురక్షితం
మధురపూడి–చెన్నై విమాన సర్వీసులు రద్దు
వర్షం పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైతులు
తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని... సోమవారం మధ్యాహ్నం తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతాంగంలోనే కాదు జిల్లా ప్రజల్లోనూ వణుకు పుట్టించింది. వర్దాగ్రహం తమిళనాడుపై చూపించడంతో జిల్లాలో చిరుజల్లులకే పరిమితమైనా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాలు ఇంకా భయం గుప్పెట్లోనే ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలానికి చెందిన ఇద్దరు గల్లంతై ఒకరు ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నాడు.
సాక్షి, రాజమహేంద్రవరం :
జిల్లాకు ’వర్దా’గ్రహం తప్పింది. జిల్లాలోనే ’వర్దా’ తీరం దాటుతుందన్న వార్తల నేపథ్యంలో తీరం వెంబడి గ్రామాలు, ఖరీఫ్ వరి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి దక్షిణ కోస్తా– ఉత్తర తమిళనాడు మధ్యన అని ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో వర్షం పడకపోయినా వాతావరణంలో మార్పు, సముద్రంలో పెద్ద అలలు, తీరం వెంబడి భారీ ఈదురు గాలులతో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. సముద్రం నుంచి భారీ అలలు ఎగసిపడడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దాదాపు నాలుగు కిలోమీటర్లు మేర రహదారి దెబ్బతింది. బీచ్ గోడ కూడా దెబ్బతింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షించారు. బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో కాకినాడ ఆర్డీవో అంబేడ్కర్, తహసీల్దార్ సింహాద్రి సూర్యారావుపేట, నేమం ప్రాంతాలను పరిశీలించి కాకినాడ–ఉప్పాడ రోడ్డును మూసివేశారు. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో సముద్ర అలలకు తీరం కోతకు గురైంది. ఫలితంగా పలువురి మత్స్యకార గృహాలు ధ్వంసమయ్యాయి. సముద్ర తీరంలో లంగరు వేసిన బోట్లు ధ్వంసమవుతుండడంతో మత్స్యకారులు తమ బోట్లను, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. ఎండు చేపల కల్లాలు ముంపునకు గురవడంతో రూ. లక్షల విలువైన ఎండు చేపలు దెబ్బతిన్నట్లు మత్స్యకారులు వాపోతున్నారు.
ఊపిరి పీల్చుకున్న రైతులు
‘వర్దా’ అతి త్రీవ తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా లేకపోవడంతో రైతులు ఊరట చెందారు. ఖరీఫ్ కోతలు, ఓదెలపై వరి పనలు జిల్లాలో ఇంకా 30 శాతం మేర మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి రైతులు తీవ్ర భయాందోళన మధ్య పంటను కాపాడుకునే ప్రయత్నాల చేశారు. తుపాను ప్రభావం తమిళనాడు రాజధాని చెన్నైలో అధికంగా ఉండడంతో మధురపూడి నుంచి చెన్నై వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
రెండు రోజులు వేటకు వెళ్లొద్దు
తొండంగి మండలం తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఉధృతం కావడంతో మత్స్యకారులు బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురు గాలులు ఎక్కువగా ఉండడంతో తీరప్రాంత గృహాలు దెబ్బతిన్నాయి. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామాన్ని మత్స్యశాఖ డీడీ ఎస్.ఏంజలీనా సందర్శించారు. స్థానిక మత్స్యకారులు, వలస మత్స్యకారులతో మాట్లాడారు. తుపాను నేప«థ్యంలో మరో రెండు రోజులపాటు సముద్రంలో వేటకు Ðð వెళ్లవద్దని సూచించారు.