అప్పటివరకు పెళ్లి చేసుకోను: విశాల్
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాన జరిగింది. స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలో సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9.50 గంటలకు పూజా కార్యక్రమాలతో భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. కాగా కమలహాసన్, రజనీకాంత్ చేతుల మీదగా శంకుస్థాపన జరుగుతుందని నిర్వాహకులు ముందుగా వెల్లడించారు.అయితే లండన్‌కు వెళ్లిన కమలహాసన్ ఉదయం 11.30 ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అదే విధంగా మలేషియా ప్రధాని తన ఇంటికి రావడం కారణంగా రజనీకాంత్ కూడా ఆలస్యంగానే వచ్చారు.
ఇక నటుడు శివకుమార్, సత్యరాజ్, విజయకుమార్, అజిత్, సూర్య, శింబు, అరుణ్‌విజయ్, సిబిరాజ్, ఉదయ, సీనియర్ నటీమణులు సరోజాదేవి, శారద, కాంచన, వైజయంతిమాల, లత, షీలా, ధన్సిక, కోవైసరళ, వరలక్ష్మీశరత్‌కుమార్ మొదలగు పలువురు నటీనటులతో పాటు రంగస్థల కళాకారులు, ఇతర సినీ దర్శకనిర్మాతలు అంటూ సినీలోకమే తరలి వచ్చింది.
ఇక అంతా విజయమే
ఈ సందర్భంగా నటుడు రజనీకాంత్ మాట్లాడుతూ సంఘం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చాలా బాగా జరిగిందన్నారు.ఇక అంతా విజయమే.ఆ భగవంతుడా ఆశీస్సులు ఉంటాయి అని అన్నారు.
చిరకాల కల నెరవేరుతోంది
కమలహాసన్ మాట్లాడుతూ చిర కాల కల ఇప్పుడు నెరవేరబోతోంది.చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది.సమిష్టి కృషితో తలపెట్టిన ఈ కార్యక్రమం చక్కగా అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి తన శుభాకాంక్షలను సంఘ అధ్యక్షుడు నాజర్,కార్యదర్శి విశాల్ తదితర కార్యవర్గానికి తెలుపుతున్నానని అన్నారు.
శపథం చేస్తున్నా..
సంఘ కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ సంఘం భవన నిర్మాణం నా కల.దీని నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు.ఎవరైనా ఆపాలని ప్రయత్నించినా, దాన్ని అధిగమించి కలసాకారం చేస్తాం. ఈ భవన నిర్మాణం తరువాతే పెళ్లి చేసుకుంటానని శపథం చేస్తున్నా.ఈ భవన నిర్మాణానికి నేను,నటుడు కార్తీ కలిసి రూ.10 కోట్లు నిధిని అందించనున్నాం. 2018 సెప్టెంబర్‌లో సంఘభవనాన్ని ప్రారంభిస్తాం అని వెల్లడించారు. ఈ భవనం ద్వారా నెలకు రూ.50 లక్షల వరకూ ఆదాయం వస్తుందన్నారు. ఆ డబ్బుతో సంఘ సభ్యులు, రంగస్థల కళాకారుల శ్రేయస్సుకు, వారి పిల్లల వైద్య విద్యలకు ఉపయోగిస్తామని తెలిపారు.నాజర్ మాట్లాడుతూ అందరి సహకారంతో భవన నిర్మాణాన్ని చక్కగా పూర్తి చేస్తామని చెప్పారు.
మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి